• సాంకేతిక విద్య సంస్కరణలపై కసరత్తు

ఇంజినీరింగ్‌ తరహా వృత్తి విద్యనభ్యసించే విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతోపాటు నైపుణ్యం పెంచేందుకు పరీక్షల విధానంలో సంస్కరణలే శరణ్యమని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) భావిస్తోంది. ఇందులో భాగంగా ఓపెన్‌ బుక్‌ (పుస్తకాలు చూసి పరీక్ష రాసే) విధానం ప్రవేశపెట్టేందుకు ఇటీవలే ఆ సంస్థ ఆమోదం తెలిపింది కూడా. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, కళాశాలల ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మరిన్ని మార్పులు అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇంజినీరింగ్‌ సహా పలు వృత్తి విద్యా కోర్సుల్లో గత కొన్నేళ్లుగా పరీక్షల విధానం, ప్రశ్న పత్రాల తయారీ విధానంలో మార్పు లేదు.

దీనివల్ల విద్యార్థులు బట్టీ పద్ధతికి అలవాటు పడుతున్నారని, ఉద్యోగాలకు తగిన నైపుణ్యం, పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారని భావించిన ఏఐసీటీఈ సంస్కరణలపై కొద్ది నెలల క్రితం నిపుణుల కమిటీని నియమించింది. ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానం అమలు చేయాలన్నది ఆ కమిటీ చేసిన సిఫార్సుల్లో ప్రధానమైనది. దానికి ఏఐసీటీఈ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దాంతోపాటు మరిన్ని సంస్కరణలు అమలు చేస్తేనే మన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో పోటీపడగలరని సాంకేతిక విద్యా మండలి భావిస్తోంది. ఆ దిశగా నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులకు కార్యశాలలు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని వృత్తి విద్యా కళాశాలల ప్రతినిధులతో గత 14న హైదరాబాద్‌లో కార్యశాల నిర్వహించింది. కార్యశాలలో పరీక్షల విధానంలో మార్పులపై ఏఐసీటీఈ నియమించిన నలుగురు నిపుణుల కమిటీ సిఫార్సులపై అవగాహన కల్పించారు. వీటికి అదనంగా ఇంకా ఎలాంటి మార్పులు అమలు చేస్తే బాగుంటుందనే సలహాలు, సూచనలు స్వీకరించారని ఏఐసీటీఈ వర్గాలు తెలిపాయి. మూల్యాంకనంలో శాస్త్రీయ విధానంపై చర్చలు కూడా నిర్వహించినట్లు వివరించాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఓపెన్‌ బుక్‌ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు, ప్రాధమిక విద్య సంస్కరణలపై కూడా ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయి. గత దశాబ్ద కాలంగా పిల్లల్లో నేర్చుకునే విద్యాసామర్థ్యాలు పడిపోతున్నాయని ప్రతి సర్వే నొక్కి చెబుతున్నా ప్రభుత్వానికి ఇన్నాళ్లూ ఉలుకూపలుకూ లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి. మరోవైపు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుండగా ఉపాధ్యాయుల హాజరు తగ్గిపోతుండటం ఆందోళనకరం. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో 3, 5, 8 తరగతుల్లో ఒక్కో తరగతికి సంబంధించి 48-55 పాఠశాలల్లో 2017 నవంబరులో న్యాస్‌ పరీక్ష నిర్వహించింది. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఆదిలాబాద్‌ జిల్లా విద్యార్థులు చివరి స్థానంలో నిలిచారు. విచిత్రమేమిటంటే ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లాల్లో సైతం 75 శాతం కంటే కచ్చితమైన జవాబులు గుర్తించిన విద్యార్థులు ఒక శాతంలోపే ఉన్నారు.

విద్యార్థులు పైతరగతికి వెళ్లే కొద్దీ వారి అభ్యసన సామర్థ్యాలు పడిపోతున్నట్లు స్పష్టమవుతోంది. చదువులో వెనకబడిన వారిని ముందుకు తీసుకెళ్లేందుకు గత ఏడెనిమిది సంవత్సరాలుగా 3ఆర్‌ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తోంది. అది తూతూమంత్రంగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అంక గణితం (రీడింగ్‌, రైటింగ్‌, అర్థమేటిక్‌) చేయగలిగి ఉండాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో 3ఆర్‌ కార్యక్రమం మొదలుపెట్టే సమయంలో ఒక ప్రాథమిక పరీక్ష(బేస్‌లైన్‌ టెస్టు) నిర్వహిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మరో పరీక్ష పెడతారు.

ఆ కార్యక్రమం అమలు తీరును ఈ ఏడాది జనవరిలో బృందాలు పరిశీలించాయి. అంత్య పరీక్షలో రాష్ట్ర సగటు 42 శాతం ఉంది. జగిత్యాల(35), హైదరాబాద్‌(24), సంగారెడ్డి(40), మెదక్‌(38), ఆసిఫాబాద్‌(27), మహబూబ్‌నగర్‌(22), పెద్దపల్లి(30), వనపర్తి(35), గద్వాల(29), సిరిసిల్ల(25), ఆదిలాబాద్‌(18), వరంగల్‌ రూరల్‌(34), జయశంకర్‌(29), నాగర్‌కర్నూల్‌ 38 శాతంతో వెనుకబడి ఉన్నాయి.