• ప్రజా సమస్యలపై గళమెత్తాలన్న చంద్రబాబు

గుంటూరు, జులై 10 (న్యూస్‌టైమ్): గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలలో ప్రజా సమస్యలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలుగుదేశం శాసనసభాపక్షం (టీడీఎల్పీ) బుధవారం గుంటూరు తెదేపా కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గురువారం నుంచి ప్రారంభంకానున్న శాసనసభ, శాసన మండలి సమావేశాలలో చర్చించవలసిన ప్రధానాంశాలపై చంద్రబాబు సూచనలు అందజేశారు.

ప్రజా సమస్యలపై గళమెత్తాలని, ప్రభుత్వం నుంచి ప్రజలకు న్యాయం అందేవరకూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలని తెలిపారు. ఆపేసిన ప్రాజెక్టులు, ఇతర పథకాలపై ప్రభుత్వ ధోరణిని ఎండగట్టాలని సూచించారు.

మరోవైపు, చంద్రబాబునాయుడు రాకతో గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. అనంతపురం పర్యటన అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, పార్టీ నాయకులు తరలివచ్చారు. దీంతో కార్యలయం కోలాహలంగా మారింది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ముఖ్య నేతలతో జరిగిన సమావేశం అనంతరం తనను చూసేందుకు వచ్చిన కార్యకర్తలందర్నీ ఆప్యాయంగా పలకరించారు.

గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చంద్రబాబును కలిశారు. వారు చంద్రబాబును సత్కరించారు. ముస్లిం మహిళలు మాట్లాడుతూ తామంతా ఓట్లు తెదేపాకే వేశామని, ఎన్నికల్లో ఓడిపోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఆవేదనగా చెప్పారు. ఓటమిపాలైనా నైతిక విజయం తెదేపాదేనని వారు పేర్కొన్నారు.

ఆరు నూరైనా వైకాపా దాడులను ఎదుర్కొని తెదేపాతోనే ముందుకు సాగుతామని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు. చంద్రబాబుకు తమ అభిమానాన్ని తెలిపేందుకు పోటీ పడ్డారు. గంటన్నరకు పైగా చంద్రబాబు ఓపిగ్గా పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరిస్తూ వారిటో ఫొటోలు దిగారు.