నెల్లూరు, జులై 10 (న్యూస్‌టైమ్): హాకీ క్రీడా హబ్‌గా నెల్లూరు జిల్లాను రూపొందిస్తానని ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

ఇటీవల కడప జిల్లా రాయచోటిలో జరిగిన సబ్ జూనియర్స్, రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానాన్ని సాధించింది. ఆ జట్టు సభ్యులను బుధవారం కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన నివాసంలో అభినందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా హాకీ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు కాకాణి. కడప జిల్లా రాయచోటిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు రెండో స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ప్రతి జిల్లాలో హాకీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలను చేపడతామన్నారు. సబ్ జూనియర్స్ స్థాయిలో ప్రత్యేక ప్రతిభను చూపిన క్రీడాకారులను గుర్తించి వారికి ఉత్తమ శిక్షణ అందిస్తామన్నారు. నెల్లూరు జిల్లా హాకీ అసోషియేషన్ కార్యదర్శి పి.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మూడు పోటీల్లో నెల్లూరు జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోషియేషన్ కోశాధికారి దివాకర్ సీనియర్ క్రీడాకారులు షాబుద్దీన్, జి.డి. సురేష్ బాబు , మైనుద్దీన్, భాను ప్రకాష్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.