నెల్లూరు, జులై 11 (న్యూస్‌టైమ్): నెల్లూరు జిల్లా మనుబోలు-బద్దెవోలు మధ్య రహదారి మలుపులు యమపురికి ద్వారాలుగా పరిణమిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు ఎన్‌హెచ్ఎఐ అధికారులు. మళ్ళీ మళ్ళీ ప్రమాదం జరుగుతున్నా కానీ అదే స్థలంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడం దారుణం. దేశంలోనే ప్రధాన జాతీయ రహదారుల్లో ఇదొకటి దీని సంఖ్య ఎన్‌హెచ్-45.

దీని ప్రత్యేకత ఏషియన్ హైవే (అంటే ఆసియా దేశాలతో కలిపే అంతర్జాతీయ రహదారి) ఇంత గొప్ప రహదారి నిర్వహణ ఎంత బాగా వుండాలి? కానీ, కొందరి నిర్లక్ష్యం కారణంగా గడచిన నాలుగు సంవత్సరాల్లో మనుబోలు-బద్దెవోలు మధ్యలో వరదల సమయంలో తెగిపోయిన వంతెన స్టానాల్లో తాత్కాలికంగా నిర్మించిన వంపు రోడ్ (హైవేల్లో వంపులు ఉండకూడదు) సరైన ఎమ్ము (రెండు లైన్ల రోడ్డుని కుదించి ఎమ్ము తగ్గించారు) లేకుండా తాత్కాలికంగా వేసిన రోడ్‌నే నాలుగు సంవత్సరాలుగా వాడుతూ సరైన హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతున్నా ఏమాత్రం మేల్కొని ఈ రహదారి నిర్వహణ అధికారులకు టోల్ వసూలు చేసే అర్హత ఉందా?

పోయిన ఏ ఒక్క ప్రాణం అయిన తిరిగి వస్తుందా? ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణాలు? అసలు ఎందుకంత నిర్లక్ష్యం? గత వారంలో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఈ రోడ్డులో ప్రయాణం ఎంత ముప్పో అర్ధమవుతుంది. పదుల సంఖ్యలో ప్రమాదాలు వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎంతో ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని యమపురికి ద్వారాలు లాంటి ఈ మలుపులు స్థానంలో బ్రిడ్జిలు నిర్మించడం అత్యవసరం.