భువనేశ్వర్, జులై 12 (న్యూస్‌టైమ్): ఒడిశాలో జులై 4న లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన పూరి జగన్నాధం రథయాత్ర కార్యక్రమం మధ్యలో ఒక అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్యశాలకి వెళ్లింది. 1,200 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సహకారంతో లక్షల మంది భక్తులు ఆ అంబులెన్సుకు దారి ఇచ్చి సమయస్ఫూర్తిని చాటారు. మనుషుల్లో మానవత్వం ఉంగా మిలిగి ఉందని చాటి చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమంటూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లడానికి అక్కడున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మానవ హారాన్నికట్టారు. భక్తులంతా ఆ అంబులెన్సు వెళ్లడానికి ఇచ్చిన సహకారానికి జనం సంతసించి నారు. ఇటీవల ఆందోళనలతో అట్టుడుకు తున్న హాంకాంగ్‌లో కూడా ఇటువంటి సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేలమంది నిరసనకారులు అంబులెన్సుకు క్షణాల్లో దారి ఇచ్చి, ప్రాణం విలువను చాటిచెప్పారు. ఇప్పుడు పూరీలో చోటు చేసుకున్న సంఘటన హాంకాంగ్‌ సంఘటనను మించి ఉందని కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు.

పూరీ రథయాత్ర కోసం 1200 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు‌, గంటల కొద్దీ సాధన చేశారు. దీని ఫలితంగా ఈ మానవహారం ఏర్పాట్లు చేయగలిగి, అంబులెన్సు వెళ్లేందుకు దారి ఇవ్వగలిగారు అని పోలీసులు, పూరీ ఎస్పీ ట్విటర్‌ పద్దులో పేర్కొంటూ ఈ దృశ్యాన్ని పోస్ట్ చేశారు.