భద్రాద్రి కొత్తగూడెం, జులై 12 (న్యూస్‌టైమ్): లక్ష్యాలకు దూరంగా, అక్రమ కార్యకలాపాలకు అతి దగ్గరగా విరాజిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెంలోని మదర్సాపై పోలీసుల దర్యాప్తు మొదలైంది. అనాథలకు, నిరుపేదల పిల్లలకు ఆశ్రయం కల్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మదర్సాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మదర్సా కార్యకలాపాలపై నిఘా పెట్టారు.

అశ్వారావుపేటలోని అల్లూరి సీతారామరాజునగర్‌ కాలనీలో పదేళ్ల కిందట షేక్‌ వలీ మదర్సాను ఏర్పాటు చేశారు. ఇక్కడ అనాథలు, నిరుపేదల పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. మూడేళ్ల కిందట పెద్దపల్లి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు మదర్సాలో చేరారు. వీరిపై నిర్వాహకుడి కుమారుడు రజాక్‌ కన్నేశాడు. అక్కకు మాయమాటలు చెప్పి శారీరక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించాడు. గర్భం దాల్చడంతో బాలిక భయంతో ఇంటికి వెళ్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.

మదర్సా నిర్వాహకుడు వలీ బాలిక తల్లి వద్దకు వెళ్లి బాధితురాలిని కోడలిగా చేసుకుంటామని నమ్మబలికాడు. ఈలోగా ఆ బాలికకు గర్భస్రావం కావడంతో వలీ, రజాక్‌ మాట మార్చి బాధితురాలికి మాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. మదర్సాలోనే ఉన్న చెల్లెలిని కూడా రజాక్‌ మాయమాటలతో లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి అశ్వారావుపేటకు వచ్చి స్థానిక ముస్లిం మత పెద్దలను ఆశ్రయించారు. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రజాక్‌ పరారయ్యాడు. వలీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మదర్సా నిర్వాహకుడు, అతని కుమారుడిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు అశ్వారావుపేట సీఐ అబ్బయ్య తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన మదర్సాను వెంటనే ఎత్తివేయాలని బాధితులు, ముస్లిం మత పెద్దలు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామస్థులు మదర్సా ప్రాంగణంలోకి వెళ్లడంతో అక్కడి మహిళలు వారిని అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అశ్వారావుపేట-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.