హైదరాబాద్, జులై 12 (న్యూస్‌టైమ్): కాషాయ వస్త్రాలను ధరించి, నుదుటను విబూది రేఖ, కనుబొమల నడుమ కుంకుమ బొట్టుతో సర్వసంగ పరిత్యాగిలా, ప్రశాంతమైన చిరునవ్వుతో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు ఎన్టీఆర్. అధికారంలో ఉండగా ఏ స్వార్థమూ తన దరి చేరకూడదని, ఏ బంధమూ తన అధికార దుర్వినియోగానికి కారణం కాకూడదని కాషాయ వస్త్రాలు ధరించారు ఎన్టీఆర్.

వ్యక్తిగత జీవితంలో అయినా రాజకీయ జీవితంలో అయినా ఎన్టీఆర్ మూడు విషయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అవే నీతి, నిజాయితీ, క్రమశిక్షణలు. తనను తాను సక్రమమార్గంలో నడిపించుకునేందుకు, జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకు కావలిసింది నీతి.

నమ్మినదానిని చిత్తశుద్ధితో ఆచరించేందుకు, స్థిరమైన లక్ష్యానికి, విలువలకు చివరివరకు కట్టుబడి ఉండేందుకు కావలిసింది నిజాయితీ. ఇక ఎంత మంచి పనిని చేయాలనుకున్నా అనుకున్న దానిని అనుకున్నట్టుగా, లక్ష్యం చేరే వరకు విడిచిపెట్టకుండా చేయడానికి కావాల్సింది క్రమశిక్షణ. క్రమశిక్షణ అన్న పదానికి నిర్వచనం ఎన్టీఆర్ అని తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు.