ఏలూరు, జులై 13 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందస్తు వ్యూహరచనతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమైన విపక్ష తెలుగుదేశంపై కన్నేసింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను తనవైపునకు ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో బలోపేతం కావాలని బీజేపీ ప్రణాళిక రచించింది.

ఇందులో భాగంగానే ఇటీవల పలువురిని పార్టీలోకి ఆహ్వానించి, కాషాయ కండువాలు కప్పింది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ ప్రభుత్వానిది కంటితుడుపు బడ్జెట్ అంటూ అధికార పార్టీని కూడా వదలని మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైకమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని జోస్యం చెప్పారు.

టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని, కంటితుడుపు బడ్జెట్‌గా ఉందని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, దానికి కారణమైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అవినీతిని వెలికి తీసి, చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయసీమలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, దీన్ని ఎదుర్కొనేందుకు, కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.