వాషింగ్టన్, జులై 13 (న్యూస్‌టైమ్): అన్నిటిలోనూ ముందుండాలని ఆరాటపడే అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఎందుకో క్రికెట్ విషయంలో కాస్త వెనుకబడింది. అయితే, లేటుగా వచ్చిని లేటెస్టుగా వచ్చామని నిరూపించుకునే ప్రయత్నాలను మాత్రం పెద్దన్న వీడలేదు.

2020లో జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే దిశగా అమెరికా జట్టును త‌యారు చేసేందుకు తన దేశ జట్టును తయారుచేస్తోంది అమెరికా. ఇందులో భాగంగా టీమ్‌ హెడ్‌ కోచ్‌గా టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరేకు అవకాశం కల్పించింది. అత్యుత్తమ ఆటతీరు కనబర్చి రిటైర్ అయిన విదేశీ సీనియర్లను కోచ్‌లుగా నియమించుకునే సంప్రదాయాన్ని భారత్ సహా దాదాపు అన్ని దేశాలు పాటిస్తున్నట్లే అమెరికా కూడా తమ జట్టు హెడ్ కోచ్‌గా ఓ విదేశీ నిపుణుడిని నియమించుకుంది.

ప్రస్తుతం అమెరికా క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా ఉన్న దస్సనాయకె ఆ బాధ్యతల నుండి తప్పుకోవడంతో మోరేకు ఆవ‌కాశం వచ్చింది. అసిస్టెంట్‌ కోచ్‌లుగా టీమిండియా మాజీ ప్లేయర్లు ప్రవీణ్‌ ఆమ్రె, సునీల్‌ జోషిలతోపాటు విదేశీ మాజీ ఆటగాళ్లు జేమ్స్‌ పామెంట్, డేవిస్‌ సేకర్‌లకు అమెరికా క్రికెట్‌ బోర్డు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా క్రికెట్‌ జట్టుకు ఇటీవలే ఐసీసీ నుండి గుర్తింపు లభించింది. టోర్నీమెంట్‌లో త‌మ జ‌ట్టు స‌త్త చాటేందుకు ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసినట్టు అమెరికా క్రికెట్‌ బోర్డు ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం.

మొత్తానికి అమెరికా ఆటగాళ్లకు తర్ఫీదు ఇచ్చే అవకాశం టీమిండియా మాజీ ఆటగాళ్లకు దక్కడాన్ని బట్టి మన క్రీడాకారులకు అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపు రుజువవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here