హైదరాబాద్, జులై 13 (న్యూస్‌టైమ్): మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘గ్యాంగ్ లీడ‌ర్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో నేచుర‌ల్ స్టార్ నాని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 24వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తాజాగా యూనిట్ ప్ర‌క‌టించింది.

‘గ్యాంగ్ లీడ‌ర్’ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక‌, ల‌క్ష్మీ, శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటారని వారికి నాయ‌కుడిగా నాని ఉంటారట‌. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో నాని అభిమానులు కాసింత అసహనానికి గురవడంతో ఆయనే రంగంలోకి దిగి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబంధించి కావాలనే ఏదీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదని, శనివారం ఉదయం 11 గంటలకు ‘గ్యాంగ్ లీడర్’ ప్రీలుక్ రిలీజ్ చేస్తామని నాని ప్రకటించారు. ప్రీలుక్‌లోనే సినిమాకు సంబంధించి ఇతర విషయాలు కూడా తెలుస్తాయని నాని వీడియోలో వెల్లడించారు.