హైదరాబాద్, జులై 13 (న్యూస్‌టైమ్): తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదిల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18న అసెంబ్లీ, 19న శాసన మండలి సమావేశం కానుంది.

జులై 18న బిల్లు పత్రాలను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించిందని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవని అధికారులు స్పష్టంచేశారు.

మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా మున్సిపల్ బిల్లుకు తుదిరూపుం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపినట్లు సీఎం తెలిపారు.

మరోవైపు, శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మరుసటిరోజు (19న) మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్ నరసింహన్ తరఫున నోటిఫికేషన్ విడుదలచేశారు.

తొలిరోజు నూతన పురపాలకచట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. 19వ తేదీన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత ఈ బిల్లును కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.

రాష్ట్రంలో నూతన పురపాలక చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పురపాలక బిల్లు ముసాయిదాకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించారు.