చెన్నై, జులై 13 (న్యూస్‌టైమ్): శ్రీ మురుగా మూవీస్‌ మేకర్స్‌ బ్యానరుపై ఉదయ్‌రాజ్‌, అవంతిక నటించిన చిత్రం ‘రీల్‌’. ఆర్‌.మునస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్‌ చంద్రన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. కథా రచయిత సురాజ్‌ మాట్లాడుతూ ‘‘ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా.

దుబాయిలో బార్‌ డ్యాన్సర్‌గా ఉన్న వ్యక్తి గురించి కథ రాశాం. అదే కథను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందని నమ్మి ఈ సినిమాను చేశాం. ఈ చిత్రాన్ని చూసేటప్పుడు ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో జరిగిన ఘట్టం గుర్తుకు వస్తుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సంబంధించిన కథ ఇది’’ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆర్‌కే సురేష్‌ మాట్లాడుతూ ‘‘10 సంవత్సరాలుగా పంపిణీదారుడిగా వ్యవహరించా. వారి ఆవేదన, కష్టాలు నాకు తెలుసు. ప్రతి పంపిణీదారుడు నిర్మాతకు అండగా వ్యవహరించాలి. చెప్పాలంటే నిర్మాతకు ఏకైక అండ మనం మాత్రమే. ఏ హీరోనూ ముందుకు రారు. సినిమా అంటే నాకు ప్రాణం. ఈ పరిశ్రమ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను ఒప్పుకోను. ఎంతో మంది గొప్పవారు ఉన్న ఈ చిత్ర పరిశ్రమలో నేను ఉండటం చాలా ఆనందంగా ఉందని’’ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సురేష్‌ ప్రేమ్‌, కలక్కపోవదుయారు శరత్‌, సాహుల్‌, సాయి సురేష్‌, సేతు, రాజ్‌సింహన్‌ తదితరులు పాల్గొన్నారు.