శ్రీహరికోట(నెల్లూరు), జులై 15 (న్యూస్‌టైమ్): చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ‘చంద్రయాన్‌-2’ ఉపగ్రహ ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. మరో 56 నిమిషాలలో ప్రయోగం మొదలవుతుందనుకున్న ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ‘షార్’ నుండి సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నిరంతరాయంగా 20 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగిన తరువాత జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 వాహక నౌక నింగిలోకి వెళ్లాల్సి ఉంది.

కానీ, సాంకేతిక కారణాలతో 19 గంటల 4 నిమిషాల 36 సెకన్ల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగిన తర్వాత సాంకేతిక కారణాలతో ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. రాకెట్‌లో సాంకేతిక సమస్యలు తలెట్జడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు తెలుస్తుంది. అయితే, ఇస్రో అధికారులు మాత్రం పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

తెల్లవారుజామున 2.30 గంటలకు షార్‌లోని సమాచార, పౌర సంబంధాల అధికారులచే, సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేయించారు. చంద్రయాన్ ప్రయోగం ఎప్పుడు చేపట్టేదో ఇస్రో వెల్లడిస్తుందని వారు ప్రకటించారు. రాకెట్ నుండి ఇంధనం లీకేని కారణం వల్లే ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరోవైపు, ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు మన దేశ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆదివారమే షార్‌కు చేరుకున్నారు. ఆయనే కాకుండా నెల్లూరు జిల్లాతో పాటు, వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రయోగాన్ని చూసేందుకు షార్‌కు తరలివచ్చారు. అయితే చివరి నిముషంలో ప్రయోగం వాయిదా పడటంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. చంద్రయాన్-2 సాంకేతిక సమస్యలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.