హైదరాబాద్, జులై 15 (న్యూస్‌టైమ్): నైరుతి రుతుపవనాల కదలికలు సాధారణ స్థాయిలో ఉన్నాయన్నప్పటికీ రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ అధికారి రాజారావు సోమవారం ఇక్కడ తెలిపారు.

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 166 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని చెప్పారు. ఇాదిలావుండగా, నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పొరుగు దేశం నేపాల్‌లో వరదలు పోటెత్తుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. వరదల ధాటికి 43 మంది మృతి చెందారు. మరో 24 మంది గల్లంతయ్యారు.

గల్లంతైననే వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నేపాల్‌ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది. వరదల ధాటికి కొన్ని ఇళ్లు కొట్టుకుని పోయాయి. మరి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగారు.

వరదల్లో మునిగిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో 100మి.మీ తీవ్రతతో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు నేపాల్‌ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.