శ్రీహరికోట(నెల్లూరు), జులై 15 (న్యూస్‌టైమ్): ‘చంద్రయాన్-1’కు కొనసాగింపుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ ఉపగ్రహ ప్రయోగం తాత్కాలికంగా వాయిదాపడిన నేపథ్యంలో తిరిగి ఎప్పుడు నింగికి ఎగురుతుందన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా, అందరూ భావిస్తున్నట్లు చిన్నపాటి సాంకేతిక సమస్య మాత్రం ప్రయోగం నిలిచిపోవడానికి కారణం కాదని, చెప్పలేని సాంకేతిక సమస్య ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తిరిగి ప్రయోగాన్ని నిర్వహించేందుకు సుదీర్ఘ సమయమే పట్టవచ్చది నిపుణుల అభిప్రాయం. ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పిన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అసలు తలెత్తిన సమస్య ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రయోగానికి 56 నిమిషాల 24 సెకన్ల వద్ద కౌంట్‌ డౌన్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మీడియా పలకరించినపుడు ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గతంలో రష్యా, అమెరికా వంటి దేశాలలో కూడా ఇలా జరిగిందని సిద్ధార్థ చెప్పుకొచ్చారు. క్రయోజనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌లో స్వల్ప లీక్‌ జరిగినట్లు తేలిందని, అయితే ఎందుకు లీక్‌ జరిగిందో విశ్లేషించాలని ఆయన పేర్కొన్నారు. పేలోడ్‌ ఎక్కువగా ఉన్నందున ఈ ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ పనికిరాదని సిద్ధార్థ అభిప్రాయపడ్డారు. ‘చంద్రయాన్‌-2’ ఉపగ్రహ ప్రయోగానికి మరి కొన్ని వారాలు పట్టవచ్చని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యాకే ప్రయోగం చేస్తే మంచిదని ఆయన సూచించారు. ప్రయోగం చేపట్టిన తర్వాత సమస్య వస్తే అనేక ఇబ్బందులు వచ్చేవని సిద్ధార్థ అన్నారు.

మొత్తానికి పీఎస్ఎల్‌వీ ఈ ప్రయోగానికి సరిపోదన్న అభిప్రాయం నేపథ్యంలో ఇస్రో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇదిలావుండగా, అన్నీ అనుకున్నట్లు సాగి ఉంటే? సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు షార్‌ నుంచి ‘జీఎస్‌ఎల్వీ మార్క్‌3-ఎం1’ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లి ఉండేది. ఆపై కేవలం 16.13 నిమిషాల వ్యవధిలో ‘చంద్రయాన్‌-2’ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టి ఉండేది. తిరిగి ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా నిర్దిష్ట సమయం (లాంచ్‌ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ప్రస్తుత లాంచ్‌ విండో (సోమవారం తెల్లవారుజాము)లో ప్రయోగాన్ని పూర్తిచేసేందుకు ‘ఇస్రో’ తీవ్రంగా శ్రమించినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి.

సోమవారం నాటి లాంచ్‌ విండో నిడివి 10 నిమిషాలు కావడం గమనార్హం. అంతకుముందు, తిరుమల వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు వచ్చారు. షార్‌లో రూ.629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం రెండో ప్రయోగ వేదిక వద్దకెళ్లి ‘చంద్రయాన్‌-2’ ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3-ఎం1 వాహక నౌకను వీక్షించారు. అక్కడే ‘ఇస్రో’ అధిపతి శివన్‌తో కలిసి ఫొటో దిగారు. అక్కడ నుంచి మళ్లీ నక్షత్ర అతిథి భవనానికి చేరుకున్న రాష్ట్రపతి దంపతులు అక్కడే రాత్రి బస చేశారు.