ఎన్టీఆర్ మహానటి సావిత్రితో కలిసి ఉన్న ఈ ఫోటో 1954లో విడుదలైన ‘పరివర్తన’ సినిమా నిర్మాణ సమయంలో తీసినది. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన ‘సంసారం’, ‘పాతాళభైరవి’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన సావిత్రికి ఎన్టీఆర్ సరసన ‘పెళ్ళి చేసి చూడు’ చిత్రంలో నటించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ‘పరివర్తన’ చిత్ర దర్శకుడు తాతినేని ప్రకాశరావు.

ఈయన ఎల్.వి.ప్రసాద్ వద్ద ‘మనదేశం’, ‘షావుకారు’, ‘సంసారం’, ‘పెళ్లిచేసి చూడు’ చిత్రాలకు… కె.వి.రెడ్డి గారి వద్ద ‘పాతాళ భైరవి’ సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ నటించినవే. ఆ సమయంలో ఎన్టీఆర్ తో ఏర్పడిన స్నేహం వల్ల పీపుల్స్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన ‘పల్లెటూరు’ చిత్రంలో దర్శకుడయ్యారు ప్రకాశరావు. ఆ తర్వాత 1953లో ఎన్టీఆర్‌ నటించి, నిర్మించిన తొలిచిత్రం ‘పిచ్చి పుల్లయ్య’ని డైరక్ట్‌ చేసారు.

తరువాత ‘అన్నాచెల్లెలు’ నాటకం ఆధారంగా అక్కినేని, ఎన్టీఆర్‌, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా ‘పరివర్తన’ చిత్రం రూపొందించారు. అప్పటికే ఈ కథానాయకులిద్దరూ ‘పల్లెటూరి పిల్ల’, ‘సంసారం’, ‘రేచుక్క’ చిత్రాల్లో కలిసి నటించారు. ‘పరివర్తన’ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేసి విడుదల చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది.