• అమ్రాబాద్‌లో యురేనియం అన్వేషణ!

  • నిరసనలతో హోరెత్తుతున్న నల్లమల

  • అటవీ సలహా మండలి సూత్రప్రాయ ఆమోదం

  • తుది అనుమతి వచ్చాకే గ్రీన్‌సిగ్నల్ అన్న సర్కారు

నాగర్‌కర్నూల్‌, జులై 18 (న్యూస్‌టైమ్): తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో అమ్రాబాద్‌ కూడా ఒకటి. సందర్శకులను ఆకట్టుకునే ప్రశాంత వాతావరణంతో పాటు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సైతం కావడం, నల్లమలకు అతి సమీపంలో ఉండడం ఈ ప్రాంతానికి బాగా కలిసొచ్చింది. అమ్రాబాద్ నుంచి ‘కృష్ణమ్మ’ అందాలు తిలకించే వ్యూ పాయింట్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇదంతా కేవలం పర్యాటకులను ఆకట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకూ అనే కోణంలోనే ఊహిస్తూ వచ్చిన స్థానికుల అంచానాలు కేవలం నాణేనికి ఒకవైపే అన్నట్లు మారాయి.

ఈ ప్రాంతంలో ఉన్న యురేనియం నిక్షేపాలను తవ్వుకుని ఆర్జించే అసలు లక్ష్యం రెండో వైపు దాగి ఉందన్నది కాలక్రమంలో వెలుగులోకి వచ్చింది. ఇక, విషయానికి వస్తే? అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో యురేనియం నిల్వలు ఉన్నాయా? పరిమాణం ఎంత? నాణ్యత ఎంతమేరకు ఉందన్నదానిపై సర్వే చేసేందుకు అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) సిద్ధమవుతోంది.

అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యంలో యురేనియం నిల్వల్ని అన్వేషించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోని ‘అటవీ సలహా మండలి’ ఏఎండీకి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మే 22న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న అటవీ సలహా మండలి పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని స్పష్టం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం.

అమ్రాబాద్‌లో యురేనియం అన్వేషణకు తెలంగాణ వన్యప్రాణి మండలి, కేంద్ర వన్యప్రాణి మండలి సైతం ఇప్పటికే ఆమోదం తెలిపాయి. నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు పెద్దఎత్తున ఉన్నాయని, నాణ్యతతో కూడినవని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) భావిస్తోంది. ఈ ప్రాంతం రక్షిత అటవీ ప్రాంతంలో ఉండటంతో సర్వే చేసేందుకు అనుమతి కోసం రెండేళ్ల కిందటే అటవీశాఖకు దరఖాస్తు చేసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని అమ్రాబాద్‌-ఉదిమల్ల, నల్గొండ జిల్లాలోని నారాయణపూర్‌ ప్రాంతాల్లో సర్వేతో పాటు భూమిలో డ్రిల్లింగ్‌ ద్వారా యురేనియం నిల్వల్ని కనుగొనేందుకు అనుమతి కోరింది. అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ) ప్రతిపాదనల్లో పూర్తి వివరాలు లేకపోవడంతో అవసరమైన పత్రాలు, వివరాలతో నిర్ణీత నమూనాలో పంపాలని కేంద్ర అటవీశాఖ సూచించినట్లు సమాచారం.

మరోవైపు, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో యురేనియం అన్వేషణకు అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు అనుమతి ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌ కుమార్‌ ఝా మీడియాతో పేర్కొన్నారు. అన్ని అనుమతులు పూర్తిస్థాయిలో వచ్చేవరకు టైగర్‌ రిజర్వులో యురేనియం అన్వేషణకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

కేంద్ర అటవీ సలహా మండలి ఇచ్చింది సూత్రప్రాయ ఆమోదమేనని, యురేనియం కోసం ఎక్కడ సర్వేచేస్తారు? ఎన్నిచోట్ల భూమిలో డ్రిల్లింగ్‌ చేస్తారు? అన్న వివరాలను అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ జిల్లా అటవీ అధికారికి ఇవ్వాల్సి ఉంటుందని, కొత్త ప్రతిపాదన వచ్చిన తర్వాత దానిపై జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో తిరిగి పరిశీలిస్తామని చెప్పారు. మొత్తానికి అమ్రాబాద్ ప్రాంతంలో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. యురేనియం నిక్షేపాల తవ్వకాల పేరిట తమ ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో స్థానికులు ఆందోళన బాటు పట్టారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో తనపాత్రేమీ లేదన్నట్లు రాష్ట్రంలోని అధికార తెరాస ఉంది. అంతా కేంద్ర నిర్ణయమేనంటూ తప్పించుకోవాలని చూస్తోందే తప్ప తవ్వకాలను అడ్డుకుంటామని మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు.