అమరావతి, జులై 18 (న్యూస్‌టైమ్): రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రివర్గ భేటీలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అదే విధంగా, ప్రాజెక్టుల కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియను పాదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపై చట్టసవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కేటాయించేలా చట్టం తీసుకురానుంది. ఈ ముసాయిదాను కూడా కేబినేట్‌ ఆమోదించింది. యజమాని హక్కులకు భంగం కలగకుండా 11 నెలల పాటు కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా రూపొందించిన బిల్లును ఆమోదించింది. దశలవారీ మద్య నిషేధం దిశగా తొలి అడుగు వేస్తూ కూడా మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని మంత్రివర్గం తీసుకుంది. ఇందులో భాగంగా తొలిదశ చర్యలు ప్రారంభమయ్యాయి.

ఇకపై ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం దుకాణాల నిర్వహణ జరగనుంది. ఇందుకు సంబంధించిన మసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూ.1.50కే ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. గడువు తీరిన స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్కు కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీ వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7వేలు, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7వేలు జీతాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. జులై నుంచీ ఈ పెంపుదల వర్తించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here