అమరావతి, జులై 18 (న్యూస్‌టైమ్): రాజధానిలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి మరీ ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని అయన విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు గురువారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌‌లోను, అనంతరం అసెంబ్లీలోనూ మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళల ఎదురుచూస్తున్నారనీ, అయితే సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైసీపీ శ్రద్ధ పెట్టిందని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కంపెనీలకు మాత్రం నష్టం రాకూడదు, ఇతరుల కంపెనీలు మాత్రం నష్టాల్లో మునిగిపోవాలి అనేదే ఆయన దురాలోచన అని దుయ్యబట్టారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల్లో భరోసా నింపేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు లేవని విమర్శించారు. కౌలు రైతులకు రెండేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు.

అన్నివర్గాల సమస్యలు సభలో వినిపించాలని, పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీనేతలకు చంద్రబాబు సూచించారు. ఏపీ అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. రూల్స్‌ ప్రకారం అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరిగిందని సీఎం జగన్‌ చెబితే, సీటు మారాలని కోరితే వెంటనే కింజరాపు అచ్చెన్నాయుడికి చెప్పానని చంద్రబాబు తెలిపారు. స్పీకర్‌ స్థానాన్ని గౌరవిస్తూ చెప్పినట్లు చేశామని చంద్రబాబు బదులిచ్చారు. టీడీపీ హయాంలో అసెంబ్లీలో వైఎస్‌ను, జగన్‌ను దూషించారని టీడీపీ సభ్యులపై మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు నన్ను అప్పుడూ తిట్టారు, ఇప్పుడు కూడా తిడుతున్నారు. మీ అంత అసభ్యంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. మీకేదో సంఖ్యా బలం ఉందని నా మీద దౌర్జన్యం చేయాలని చూస్తే నేనేమీ భయపడను. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటా’ అని చంద్రబాబు బదులిచ్చారు. మరోవైపు, ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని ఉప ముఖ్యమంత్రి, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది.

పార్లమెంటు నియోజక వర్గాల ప్రాతిపాదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. అయితే జిల్లాల ఏర్పాటుకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సభ్యులు సూచించారు. దీనిపై కమిటీ లేదా అఖిల పక్షం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. పరిపాలన సౌలభ్యంగా ఉండేలా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

గిరిజన నియోజకవర్గాలను కలిపే సయమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సభ్యులు కోరారు. జిల్లాల ఏర్పాటు అంశం పరీశీలన స్థాయిలోనే ఉందని మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల అంశం ప్రతిపాదన దశలోనే ఉందని, సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here