హైదరాబాద్, జులై 18 (న్యూస్‌టైమ్): చాలా రోజుల గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలయిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా తక్కువ సమయంలో తెరకెక్కిన పూరి చిత్రాల్లో ఒకటి. జగన్నాథ్ సినిమాలంటే మాస్ హంగులకు, హీరోయిజానికి లోటు ఉండదు.

‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ లాంటి ఘన విజయాలతో అగ్ర హీరోలకు ధీటుగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారాయన. ‘టెంపర్’ తర్వాత తన శైలి సినిమాలకు కొంత దూరమైన పూరి జగన్నాథ్ వరుసగా పరాజయాల్ని ఎదుర్కొన్నారు. పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలనే తపనతో రామ్ హీరోగా ఆయన పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై హీరోయిన్ ఛార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్’. హీరో రామ్‌తో ఆయన కలయికలో వచ్చిన తొలి సినిమా ఇది.

‘ఇస్మార్ట్ శంకర్’ పూరి జగన్నాథ్‌ను విజయాల బాట పట్టించిందా? మాస్ హీరోగా నిరూపించుకోవాలనే రామ్ కోరిక ఈ సినిమాతో ఏ మేరకు సఫలమైంది అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన ఇస్మార్ట్ శంకర్(రామ్) ఓ క్రిమినల్. డబ్బు కోసం మాజీ ముఖ్యమంత్రి కాశీ విశ్వనాథ్‌ను చంపేస్తాడు. ఈ నేరం నుంచి తప్పించుకునే క్రమంలో అతడి ప్రియురాలు చాందిని (నభానటేష్) చనిపోతుంది. ప్లాన్ ప్రకారం తనతో ఈ హత్య చేయించి నేరస్తుడిగా ముద్రవేశారనే వాస్తవం తెలుసుకున్న శంకర్ అసలు హంతకులను పట్టుకోవడం కోసం జైలు నుంచి పారిపోతాడు.

మరోవైపు నిజాయితీపరుడైన సీబీఐ అధికారి అరుణ్(సత్యదేవ్) ఈ హత్యకేసును పరిశోధిస్తుంటాడు. కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చే క్రమంలో అరుణ్ చనిపోతాడు. దాంతో అతడి ప్రియురాలు న్యూరో సైంటిస్ట్ సారా (నిధి అగర్వాల్) సహాయంతో అరుణ్ మెదడులో నిక్షిప్తమైన రహస్యాల్ని శంకర్ బ్రెయిన్‌లోకి పంపిస్తారు. ఆ తర్వాత ఏమైంది? అరుణ్ జ్ఞాపకాల వల్ల శంకర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అరుణ్ మెమోరీ సహాయంతో అసలు హంతకుల్ని శంకర్ ఎలా పట్టుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. పూరి జగన్నాథ్ స్టైల్‌లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రమిది.

మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ కథను రాసుకున్న పూరి జగన్నాథ్ హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లాస్, మాస్ మేళవింపుతో అంతర్లీనంగా రెండు ప్రేమకథలను నడిపిస్తూనే సమాంతరంగా హత్యానేరం దాని తాలూకూ చిక్కుముడులతో కథనాన్ని అల్లుకున్నారు. గత ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని మాస్ హంగులకు పెద్దపీట వేస్తూ ఈ సినిమాను రూపొందించారు. ప్రతి సన్నివేశం నుంచి హీరోయిజాన్ని పండించే ప్రయత్నం చేశారు. రామ్, నభానటేష్ పాత్రచిత్రణలు, వారి డైలాగ్ డెలివరీ అన్ని మాస్ ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగానే తీర్చిదిద్దారు.

ప్రథమార్థం మొత్తం రామ్, నభానటేష్ రొమాన్స్‌తో సరదాగా సినిమా సాగిపోతుంది. హైదరాబాదీ యాసలో ఒకరినొకరు ద్వేషిస్తూనే ప్రేమను కనబరిచే సన్నివేశాలన్నీ టైమ్‌పాస్ చేస్తాయి. నభానటేష్ పాత్రను చంపే సన్నివేశంతో కథ రసకందాయంలో పడుతుంది. మెమోరీ ట్రాన్స్‌ఫర్ తర్వాత ఒకే బ్రెయిన్‌లో ఇద్దరి జ్ఞాపకాలతో రామ్ పాత్ర పడే సంఘర్షణ నవ్విస్తూనే ఆసక్తిని పంచుతుంది. ఒకవైపు ప్రియురాల్ని మర్చిపోతానేమోనని మదన పడుతూనే మరోవైపు అరుణ్ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి రామ్ పడే తపన, చేసే ప్రయత్నాలన్నీ చకచకా సాగిపోతూ కథలో ప్రేక్షకుడిని లీనం చేస్తాయి.

ఒకే మనిషి ఇద్దరిలా ప్రవర్తించడం అనే సంక్లిష్టమైన అంశాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తనదైన మ్యాజిక్‌తో సరదాగా నడిపించారు పూరి జగన్నాథ్. అసలు హంతకుడు ఎవరనే చిక్కుముడిని విప్పే సన్నివేశాలు పోకిరి, బిజినెస్‌మెన్ కాలం నాటి పూరి జగన్నాథ్‌ను గుర్తుకు తెస్తాయి. పతాక ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. దర్శకుడిగానే కాకుండా తనదైన శైలి పంచ్‌లతో హైదరాబాదీ యాసలో పూరి జగన్నాథ్ రాసిన సంభాషణలు అలరిస్తాయి. మర్డర్ మిస్టరీ సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు.

అనేకసార్లు తెరపై వచ్చిన రొటీన్ కథకు హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తిగా తీసుకున్న మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే పాయింట్‌ను జోడించి పూరి జగన్నాథ్ ఈ సినిమాను రూపొందించారు. మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు చాలా చోట్ల అసలు కథను పక్కదారి పట్టించాయి. అలాగే అరుణ్ జ్ఞాపకాలంటూ బికినీలో హీరోయిన్‌ను పదేపదే చూపించడం ఆకట్టుకోదు. అరుణ్ మెమోరీ సహాయంతో హంతకులను పట్టుకోవడానికి రామ్ సాగించిన అన్వేషణలో ఉత్కంఠ లోపించింది. పతాక ఘట్టాల్లో హఠాత్తుగా హంతకుడెవరో తనకు తెలుసు అంటూ చెప్పే సన్నివేశం ఆకట్టుకోదు.

అలా కాకుండా అరుణ్ జ్ఞాపకాల సహాయంతో ఒక్కో రహస్యాన్ని ఛేదిస్తూ వెళ్లేలా చూపిస్తే బాగుండేది. ఇలా చిన్న చిన్న లాజిక్‌లు సినిమాలో చాలా చోట్ల మిస్సయ్యాయి. హైదరాబాదీ యాసలో రామ్ చెప్పిన డైలాగ్‌లు కొన్ని చోట్ల సరిగా కుదరలేదు. ఇదివరకు పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు రామ్. అతడిలోని మాస్ కోణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన మొదటి సినిమా ఇది.

‘ఇస్మార్ట్ శంకర్’ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. హైదరాబాదీ లోకల్ యువకుడిగా అతడి ఆహార్యం, సంభాషణలు చెప్పే తీరు కొత్తగా ఉన్నాయి. ప్రియురాలు దూరమై మనోవేదనకు గురయ్యే ప్రేమికుడిగా, అరుణ్ లక్ష్యాన్ని చేపట్టే వ్యక్తిగా భిన్న పార్శాలతో కూడిన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. వరంగల్ అమ్మాయిగా నభానటేష్ చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. పాటల్లో గ్లామర్ తళుకులతో మెప్పించింది. సారా అనే న్యూరో సైంటిస్ట్‌గా నిధి అగర్వాల్ పాత్రకు తగినట్లుగా నటించింది. పునీత్ ఇస్సార్, షయాజీ షిండే, సత్యదేవ్ పాత్రల నిడివి తక్కువే అయినా మెప్పిస్తాయి.

ఈ చిత్రానికి మణిశర్మ స్వరపరచిన మాస్, మెలోడీ గీతాలు, నేపథ్య సంగీతం ప్రాణంపోశాయి. చాలా చోట్ల తన నేపథ్య సంగీతంతోనే సినిమాను నిలబెట్టారు మణిశర్మ. రాజ్‌తోట ఛాయాగ్రహణం బాగుంది. వింటేజ్ కలర్స్‌తో హైదరాబాద్‌ను కొత్తగా ఈ సినిమాలో చూపించారు. తన నమ్మిన కథ కోసం నిర్మాతగా ఎక్కడ రాజీపడకుండా పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, పక్కా పూరి జగన్నాథ్ శైలిలో సాగే మాస్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆయన మార్కు సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానంగా ఈ సినిమా నిలుస్తుంది.

మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది. రామ్ శంకర్ పాత్రలో పూర్తిస్థాయిలో మెప్పించాడనే చెప్పాలి. మేకోవర్‌తో ఇస్మార్ట్ అనిపించాడు రామ్. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక సిక్స్ ప్యాక్‌లో అదరగొట్టాడు. హీరోయిన్‌ల విషయానికి వస్తే నిధి అగర్వాల్, నభా నటేష్‌లు ఇద్దరు కూడా గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కుర్రాళ్లకు ఈ ఇద్దరు అందాలతో విందు చేసారు.

ఇక నటనతో కూడా మెప్పించారు. వరుస పరాజయాలతో తీవ్ర అసహనంతో ఉన్న పూరి ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని కసిగా ఈ సినిమా చేసాడు. అయితే ఊర మాస్‌కు బాగా నచ్చే అంశాలతో తెరకెక్కించాడు కానీ ఏ సెంటర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోలేకపోయాడు. మణిశర్మ నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మరింతగా ఎలివేట్ అయ్యింది. విజువల్స్ బాగున్నాయి.

కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ని కథలో భాగం చేసుకొని పూరి ఈ చిత్రాన్ని రూపొందించారన్నది తొలి రీలు నుంచే అర్ధమవుతుంది. తెరపై కనిపించేది, వినిపించేది చివరకు గుర్తుండేది కూడా రామ్ పాత్ర ఒక్కటి మాత్రమే. అంతగా ఈసినిమాని తను ఓన్ చేసుకున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ నుండి డాన్స్‌లలో కనిపించిన ఊపు చూసి మాస్ సినిమాల రుచి మరోసారి గట్టిగా తగిలింది. టైటిల్ సాంగ్‌లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి రామ్ చేస్తున్న డాన్స్‌లు ఇచ్చిన కిక్ మాములుగా లేదు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగింది నభా మాత్రమే.

నన్నదోచుకుందువతేతో చలాకీ పిల్లగా కనిపించిన నభా ఇందులో ఇస్మార్ట్‌ని కంట్రోల్ చేసే అంత డామినేటింగ్ క్యారెక్టర్ చేసింది. జిందాబాద్ బోనాలు పాటలలో నభా చూపించిన గ్రేస్ కమర్షియల్ హీరోయిన్‌గా నభాకు ఉండే స్కోప్‌ని పరిచయం చేసాయి. ఇక క్యారెక్టర్‌లో ఫోర్స్‌ని రామ్ ఓన్ చేసుకొని పూర్తిగా ఇస్మార్ట్‌గా మారిపోయాడు. ‘మామా జ్ఞాన్ మత్ దేనా’ అంటూ పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్‌లో ఇరగదీసాడు. క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యాక అతని ట్రావెల్ వచ్చే మలుపులు కన్నా అతను ఆ మలుపులలో రియాక్ట్ అయ్యే తీరు ఎంటర్‌టైన్ చేస్తుంది. అదే ఇస్మార్ట్ శంకర్‌లో బాగా వర్క్ అవుట్ అయ్యింది.

ఒకరి మెమరీస్‌ని మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి సైంటిఫిక్ కాన్సెప్ట్‌కి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించడంలో పూరి ఆడియన్స్ బాగా ఎంటర్‌టైన్ చేసాడు. ఇస్మార్ట్ శంకర్‌కి సీబీఐ ఆఫీసర్ మెమరీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసాక అతని క్యారెక్టర్ ఎలా మారుతుంది? ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎవరితో ఎలా రియాక్ట్ అవుతుంది? అనే సర్‌ప్రైజస్‌ని బాగా డిజైన్ చేసాడు? సీబీఐ ఆఫీసర్ లవర్‌తో నువ్వెందుకు నాకు గుర్తొస్తున్నావ్? నువ్వు నాకు వద్దు అంటూ శంకర్ చెప్పే సన్నివేశంలో ఆ క్యారెక్టర్‌లోని పెయిన్‌ని ప్రజెంట్ చేసాడు పూరి.

ఇంకా అడ్డదిడ్డంగా కనిపించే శంకర్ తను ప్రేమించిన అమ్మాయి మెమరీస్ దూరం అవుతున్నాయని బాధపడే సీన్ బాగా డిజైన్ చేసాడు? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే కలిగే పెయిన్ తెరపై కొత్తేమీ కాదు కానీ ఆ అమ్మాయి మెమరీస్ దూరం అవుతున్నాయని పడే బాధ కొత్తగా అనిపించింది. సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేసాడు. కానీ తన మెమరీస్ ఛేంజ్ అయితే సడన్‌గా ఇంగ్గీష్ ఎలా వస్తుందనే డౌట్ కొడుతూనే ఉంది. అప్పటి వరకూ ఇస్మార్ట్ బాషకు అలవాటు పడిన ప్రేక్షకుడికి రామ్ కొత్తగా కనిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here