• ప్రతిపక్షంపై వైకాపా వ్యంగ్యాస్త్రాలు

  • గందరగోళం మధ్యే ఏపీ అసెంబ్లీ భేటీ

  • సభ్యుల అరుపుల మధ్య వాయిదాలు

  • జగన్‌ లక్ష్యంగా తెదేపా మాటల తూటాలు

అమరావతి, జులై 19 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఏకంగా ఏడో రోజు కూడా గందరగోళ పరిస్థితుల మధ్యే కొనసాగాయి. సభ్యుల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శలతో ఆద్యంతం సభలో అయోమయ వాతావరణం నెలకొంది. చివరికి ప్రశ్నోత్తరాలు, జీవో అవర్ కూడా సవ్యంగా సాగకపోవడం శోచనీయం. ప్రతిపక్షంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యంగ్యాస్త్రాలు సంధించగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం మాటల తూటాలు పేల్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంశం చర్చకు వచ్చింది.

పోలవరం ప్రాజెక్టుపై ఐదేళ్లపాటు గత తెదేపా ప్రభుత్వం ఏమీ చేయలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ ఆరోపించారు. ఆఖరి రెండేళ్లు కొంత శ్రద్ధపెట్టిందని ఎద్దేవాచేశారు. లక్షా 6 వేల కుటుంబాల్లో 3,900 మందికి మాత్రమే పునరావాసం కల్పించారనీ, మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై 2014 వరకు కేవలం మట్టి పనులు మాత్రమే చేశారని అన్నారు.

అనంతరం పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ చేసి అదనంగా డబ్బు ఇచ్చామన్నారు. తెదేపా హయాంలోనే హెడ్‌వర్క్‌ పనులు 71 శాతం పూర్తి చేశామన్నారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గందరగోళ పరిస్థితుల్లోనే తర్వాతి ప్రశ్నకు వెళ్లాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ సూచించారు. దీంతో పోలవరంపై చర్చ జరపాలని తెదేపా సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై చర్చ చేపడదామని, ఈ సమయాన్ని వృథా చేయవద్దని స్పీకర్‌ సూచించారు.

సరైన ఫార్మాట్లో వస్తే చర్చకు తప్పకుండా అనుమతిస్తానన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా సభ్యులు నినాదాలు మొదలు పెట్టారు. మొత్తానికి తెదేపా సభ్యుల నినాదాలు, అధికార సభ్యుల ఎద్దేవ సమాధానాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. టీడీపీ విమర్శలకు సమాధానమన్నట్లు ముఖ్యమంత్రి జగన్ తనదైన రీతిలో స్పందించారు. తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభను తన స్వార్ధం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం చేసిన స్కామ్‌లన్నీ త్వరలోనే బయటకు వస్తాయని, వాటన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. పోలవరంపై సభలో టీడీపీ రాద్ధాంతం చేయడం శోచనీయమన్నారు జగన్‌. ‘‘పోలవరంపై టీడీపీ సభ్యులు ఎందుకంత రాద్ధాంతం చేస్తారు? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా నీటిపారుదల శాఖ మంతి వివరణ ఇస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇటివలే నేను పోలవరం ప్రాజెక్టును సందర్శించాను. గత ప్రభుత్వం కారణంగానే పోలవరం పనులకు అంతరాయం ఏర్పడింది. తొలుత స్పిల్‌ వేల పనులు పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యామ్‌పై శ్రద్ధ పెట్టారు. దానిని కూడా మొత్తం పూర్తి చేయలేదు. కాఫర్‌ డ్యామ్‌ వల్ల గోదావరి వెడల్పు 70 శాతం తగ్గిపోయింది. మిగిలిన కొద్ది భాగం నుంచే వరద నీరు వెళ్లాల్సిన పరిస్థితి. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వరదలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్‌ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. 2021 వరకు పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలనేదే మా లక్ష్యం. పోలవరంపై తొలిసారిగా రివర్స్‌ టెండరిగ్‌ వెళ్తున్నాం. సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ ప్రభుత్వం తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టింది.

పోలవరంపై గత ప్రభుత్వ హయంలో దారుణమైన స్కామ్‌లు జరిగాయి. ఏ పనులు కాకుండానే నవయుగ కంపెనీకి రూ. 724 కోట్లు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చారు’’ అని వ్యాఖ్యానించారు. అంతకముందు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరంపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు మంత్రి అనిల్‌కుమార్‌ సమాధానం చెప్పారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవం ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు. టీడీపీ ఖర్చు చేసిన దాని కన్నా ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి పోలవరం పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

పోలవరంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేశారని గుర్తుచేశారు. నిర్వాసిత కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు బాధితుల గురించి టీడీపీ ఏపీ ఆలోచించలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము ఆపేశామనడం సరికాదని పేర్కొన్నారు.

అయితే ఈ అంశంపై మంత్రి సమాధానం చెప్పినప్పటికీ టీడీపీ సభ సజావుగా సాగకుండా చేసేందుకు యత్నించారు. సభకు ఇబ్బంది కలిగించేలా నినాదాలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, సభలో టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. ప్రాపర్‌ ఫార్మాట్‌లో వస్తే పోలవరంపై తాము చర్చిస్తామని స్పష్టం చేశారు. అయిన కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here