న్యూఢిల్లీ, జులై 19 (న్యూస్‌టైమ్): భారతీయ యువతను వివిధ కోణాలలో ప్రభావితంగా చేస్తున్న చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లు ‘టిక్ టాక్’, ‘హలో’ మనుగడ దేశీయంగా మళ్లీ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ యాప్‌లను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులను జారీచేసింది.

టిక్ టాక్‌తో పాటు హలో యాప్ భారత్‌కి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా వాడట్లేదని నిరూపించుకోవాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటీస్‌ ఇచ్చింది. ఈ నోటీసులో మొత్తం 21 ప్రశ్నలకు సమాధానం కోరింది కేంద్రం. జులై 22లోగా తమ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం చెప్పకపోతే, రెండు యాప్‌లనూ ఇండియాలో నిషేధిస్తామని, లేదంటే ఐటీ చట్టం, ఇతర చట్టాల కింద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

టిక్ టాక్ యాప్ ద్వారా యూజర్లకు సంబంధించిన డేటా చైనాకు వెళ్తోందనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. వీటిని ఖండించిన టిక్ టాక్ తాము డేటాను అమెరికా, సింగపూర్‌లో మాత్రమే స్టోర్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. దీనిపై అభ్యంతరం తెలిపిన కేంద్రం భారతీయుల డేటా మరే ఇతర దేశాలకు ట్రాన్స్‌ఫర్ కావట్లేదని నిరూపించాలని నోటీస్‌లో కోరింది.

చైనాలో డేటా స్టోర్ అవుతోందా? అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయాలని, అలాగే భవిష్యత్తులో డేటా థర్డ్ పార్టీకి గానీ, ప్రైవేట్ సంస్థలకు గానీ వెళ్లదన్న గ్యారెంటీ ఇవ్వాలని కేంద్రం తన నోటీసులో పేర్కొంది. టిక్ టాక్, హలో యాప్స్ ద్వారా అనధికారిక డేటా షేరింగ్, యాప్స్‌లో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు వంటి అంశాలపై కేంద్రం ప్రశ్నలు సంధించింది.

అలాగే ఇతర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ చేసిన రాజకీయ ప్రకటనల కోసం ఈ రెండు సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయని వచ్చిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాలని తెలిపింది. హలో యాప్‌ ద్వారా 11 వేలకుపైగా డూప్లికేట్ పొలిటికల్ యాడ్స్ ఇతర సోషల్ మీడియా పోర్టల్స్‌లో వస్తుండటంతో కేంద్రం సమాధానం కోరింది. 18 ఏళ్లలోపు వారు యాప్ వాడకుండా నిషేధించాలని నోటీస్‌లో స్పష్టం చేసింది.