విజయవాడ, జులై 19 (న్యూస్‌టైమ్): ఆదిపరాశక్తిగా భక్తులతో పూజలందుకుంటున్న దుర్గమ్మ ప్రత్యేకత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ ఉండదు. కొలిచే భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారిని అనునిత్యం కొలిచే భక్తులతో పాటు కేవలం శుక్రవారం పూట ఆరాధించే వారు అధికం.

పూర్వం ఇంద్రకీలుడనే యక్షుడు ఉండేవాడు అతడు గొప్ప దేవీ భక్తుడు. శివపార్వతులను గురించి వేల సంవత్సరాలు తపస్సుచేశాడు. అతని భక్తికి మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడా యకక్షుడు ఆది దంపతులు ఎల్లప్పుడూ తనపై అధిష్టించి ఉంచేటట్లుగా వరం కోరాడు. శివపార్వతులు అతనిని శైలరూపాన్ని పొందమని చెప్పారు.

ఆ శైలరూపమే ఇంద్రకీలాద్రి. ఆనాటు నుండి శివపార్వతులు ఇంద్రకీలాద్రిపై నివాసం ఉంటున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అష్టభుజాలను కలిగి ఉంది. చేతులలో శూలం, బాణం, ఖడ్గం, పాశం, చక్రం మొదలైన ఆయిధాలను ధరించి ఉంటుంది. సింహాసనం ఎక్కివచ్చి మహిషాసురుని మర్ధించిన రూపంలోనే దుర్గాదేవి దర్శనం ఈ ఆలయంలో మనకి లభిస్తుంది. కనకదుర్గ ఎడమ భాగంలో శ్రీచక్రం స్ధాపించబడి ఉంది. ఈ శ్రీచక్రం పక్కనే గణపతి విగ్రహం ఉంది.

శ్రీ దుర్గామల్లేశ్వర ఆలయంలో కనకదుర్గకు జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతున్నాయి. గర్భాలయానికి ముందు అంతరాలయం, దాని ముందు ముఖమంటపం ఉన్నాయి. విజయవాడ శక్తి ప్రాధాన్యమైన క్షేత్రమే అయినప్పటికీ శాక్తేయ విధితో ఆరాధన ఇక్కడ లేదు. ఇది ఇక్కడి విశిష్టత. ఈ ఆలయంలో దేవీ మూర్తిని మహిషాసురమర్ధనిగా ఉన్న రూపంలో దర్శనం ఇస్తుంది.

ఈ దేవీ మహిషాసుర మర్ధని అయితే దుర్గాదేవి అని ఎందుకు పిలుస్తాన్నాం. కనుక మూర్తి వేరే ఎక్కడైనా ఉందా? దీనికి ఆధారాలు కనిపించవు గానీ పెద్దలు చెప్పే విషయాలను గమనిస్తే కనకదుర్గాదేవి మూర్తి ఇంద్రకీలాద్రి మీదనే మరొకచోట చోట ఉందని, ఆ దేవతని ప్రతిరోజూ దేవతలు, మహర్షులు, యకక్షులు, కిన్నెరలు, యోగులు దర్శించి ఆరాధిస్తున్నారని మహిషాసుర మర్ధని మూర్తి ప్రధమ ద్వారం అని, రెండవ ద్వారం దగ్గర చింతామణి దుర్గాదేవి మూర్తి ఉందని తెలుస్తుంది.

ఇంద్రకీలాద్రిపై ఉన్న మహిషాసుర మర్ధనికి ఆ పేరు రావానికి కారణం పేరులోనే వుంది. మహిషాసురుని సంహరించిన కారణంగా ఆమెకు ఆ పేరు వచ్చింది. దితి పుత్రులైన దైత్యులను అందరినీ ఇండ్రుడు సంహరిస్తూ ఉండటం వలన ఇంద్రుని జయించగలిగిన పుత్రుని పొందాలని సుపార్శ్వుడు అనే ముని ఆశ్రమం పక్కన దితి తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు వేడిమికి ఆగలేక సుపార్శ్వుడు నీకు మహిషుడు పుట్టుగాక అనే శపించాడు. కానీ ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీకుమారుని ముఖం మాత్రమే మహిష ముఖంగా ఉంటుందని, మిగిలిన శరీరము నరుని వలే ఉంటుందని చెప్పాడు.

దితికి పుట్టిన మహిషాసురుడు శివుని గురించి ప్రార్థించగా మహిషుడు తనకు మరణంలేకుండా ఉండే విధంగా వరం కోరుకుంటాడు. ప్టుట్టిన వారికి మరణం తప్పదని శివుడు చెప్పగా మహిషుడు తనకు స్త్రీ వలన మరణం కలిగే విధంగా వరం కోరుకుంటాడు. రాక్షసులందరూ మహిషుణ్ణి పూజిస్తారు. మహిషుడు దేవతలు అపహరించిన రాజ్యాన్ని తిరిగి స్వాధీనపరచుకుంటాడు. మహిషుడు పెట్టే బాధలకు తట్టుకోలేక దేవతలు తమ నారీ తేజాలు ఒక్కిటిగా చేసి ప్రార్థిస్తారు.

ఆ నారీతేజం నుండి దేవీ ఉద్భవిస్తుంది. ఆమెకు దేవతలు తమ తమ ఆయుధాలు ఇవ్వగా, ఆ దేవి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషునితో యుద్ధం చేసి అతడిని సంహరిస్తుంది. అప్పటినుండి ఆమెను మహిషాసుర మర్ధనిగా పిలుస్తారు. దేవీ భాగవతంలో ఈమె పుట్టుకకు సంబంధించిన మరొక కధ కూడా ఉంది. శుంభ నిశుంభులనే రాక్షసులు శివుని ప్రార్థించి శివుని అనుగ్రహంతో పురుషుల వలన మరణం పొందని వరాన్ని పొందారు. వీరు దేవతలను బాధలు పెడుతూ, యజ్ఞభాగాలను అపహరించుకు పోవటం వలన దేవతలు శివుని ప్రార్థించారు. అపుడు గౌరి శరీరం నుండి ఒక దేవత పుట్టింది.

ఆమె పేరు కౌశిక. కౌశికను వివాహం చేసుకోమని శుంభనిశుంభులను చండముండులనే రాక్షసులు ప్రోత్సహిస్తారు. శుంభ నిశుంభులు తమను భర్తలుగా స్వీకరించమని ఆమె దగ్గరకు దూతను పంపుతారు తనతో యుద్ధంచేసి గెలిచిన వారినే వివాహం చేసుకుంటానని ఆమె చెప్పింది. వీరు తమ సేనా నాయకులైన ధూమ్రలోచనుని, చండముండుల్ని, రక్తబీజుని పంపగా కౌశికీ దేవి వారిని సంహరిస్తుంది. అప్పుడు శుంభ నిశుంభులే యుద్ధానికి వెళ్ళగా ఆమె వారిని కూడా సంహరిస్తుంది.

ఈ దుష్ట రాక్షసుల సంహరణ కోసం ఆమె భీకర రూపాన్ని దాలుస్తుంది. ఆప్పుడు ఆమె నుండి వెలువడిన రౌద్ర శక్తులు రాక్షసులను మట్టుపెడతాయి. అంత ఊగ్రరూపంలో ఉన్న దుర్గను కొలవడానికి భక్తులు భయపదేవారు. ఆ సందర్భంలో ఆదిశంకరుల వారు ఆ దేవిని దర్శించి, ఆ దేవీమూర్తి అతి భీకర రూపాన్ని రౌద్రకళలను ఉపసంహరించి, వారిని వేరొక మూర్తిలో ప్రవేశపెట్టి ఈ దేవిని శాంతమూర్తిగా దర్శనమిచ్చునట్లుగా అనుగ్రహించారు. రౌద్ర రూపాన్ని త్వజించడం కోసం ఆమెకు మల్లీశ్వరస్వామితో కళ్యాణం జరిపించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర స్ధాపన చేశారు.

అప్పటి నుండి శాంతమూర్తి అయిన దుర్గాదేవిని వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు జరిగే ఉత్పవాలలో దేవిని సరస్వతి, లక్ష్మీ, దుర్గ, కాళి, త్రిపుర, రాజరాజేశ్వరి, లలితా దేవి, గాయత్రీ దేవి మొదలైన అలంకారాలతో పూజిస్తారు. దేవికి ఈ అలంకారాలను చేయడంలోని ఉద్ధేశం దేవీ దేవతల నారీ తేజాల నుండి పుట్టింది కాబట్టి ఆయా రోజుల్లో దేవీ మూల అంశాలైన ఆయా దేవతలను పూజించడమే. పురాణాలను పరిశీలిస్తే దేవిని దర్శించి పూజించిన వారిలో రాముడు, కృష్ణుడు, పరశురాముడు మున్నగువారు కనిపిస్తారు.

అర్జునుడు మల్లయుద్దంలో శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన సందర్భంలో ఇంద్రకీలాద్రిపై విజయేశ్వరుడనే పేరుతో ఈశ్వరలింగాన్ని ప్రతిష్టించి విజయేశ్వరాలయాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి పూజాది కార్యక్రమాలకు దూప, దీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేసినట్లుగా దుర్గాలయానికి కొంచెం దూరంలో ఉన్న రాయల శాసనం ప్రకారం తెలుస్తుంది.

అక్కన్న మాదన్నలు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారనటానికి ఇక్కడే ఉన్న అక్కన్న మాదన్న గుహలే నిదర్శనం. దసరా ఉత్సవాలలో అమ్మవారు కనకదుర్గాదేవిగా, గాయత్రీ దేవిగా, అన్నపూర్ణా దేవిగా, శ్రీలలితా దేవిగా, త్రిపుర సుందరిగా, మహాలక్షీగా, సరస్వతి దేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్ధనిగా, రాజరాజేశ్వరీదేవిగా అలంకిరిస్తారు. ఈ తొమ్మిది రోజులు కొలిచిన వారికి కొంగు బంగారమై ఉండే దేవిని
సమ్మతి నా మనంబున సనాతనులైన యుమా మహేశులన్‌
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటిపెద్దమ్మ
దయాంబు రాశివి గదమ్మ హరింబతి జేనయక మమ్మనిన్‌
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ
అని రుక్మిణిదేవి ప్రార్ధించి అనుగ్రహం పొందినట్లే ఎంతోమంది భక్తులు అనుగ్రహం పొందుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.

ప్రతిరోజూ వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు. ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు. ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు. మిగతా పూజలకూ రుసుం రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు.

ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు.

స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు. దేవస్థానంలో నిర్వహించే పూజలు: ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు.

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు.

దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు. 1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. విజయవాడకు రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో వెళ్లవచ్చు.

విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గం, రైలు మార్గంలో చేరడం చాలా సులభం. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుండి అమ్మవారి గుడికి బస్సులున్నాయి. ప్రైవేటు ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి గుడిపైకి వెళ్లవచ్చు.

దగ్గరలోని విమానాశ్రయం గన్నవరం. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ, నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో భక్తులకు ఇస్తారు. విజయవాడలో అన్ని తరగతుల వారికి అందుబాటులో హోటల్స్ కలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here