వేదము వేంకట రాయశాస్త్రి… సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు. ఇతడు వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించాడు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించాడు.

1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతంలలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రథాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశాడు. వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించాడు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించాడు.

ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో రాసిన ప్రతాపురుద్రీయ నాటకం, 1901లో రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి… ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించాడు. వెంకటరాయ శాస్త్రి 1929, జూన్‌ 18న తెల్లవారుజామున 5:45కు మద్రాసులో మరణించాడు.