అమరావతి, జులై 22 (న్యూస్‌టైమ్): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితి బాలేదు. వైద్య ఆరోగ్యశాఖ సక్రమంగా పనిచేయడం లేదు. ఇలా అయితే ప్రజారోగ్యం మాటేంటి? ప్రజలకు మనపై ఎలా నమ్మకం ఉంటుంది? ఈ పద్దతి మారాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలి’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే. అదీ కలెక్టర్ల సమావేశంలో. అయితే ఇదేమన్నా కొత్తగా మాట్లాడుతున్న మాటలా అంటే అదీకాదు. ప్రజలకు ఏదో చేయాలనే తపనకు జిల్లా కలెక్టర్‌ల సహకారం పూర్తిస్థాయితో తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాలన్నది సీఎం ఆలోచన. కానీ ఆచరణ మాత్రం చాలా దూరంలో వుంది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నది వైద్య ఆరోగ్యశాఖకేనన్న మాటలు కొట్టొచ్చినట్టు ముఖ్యమంత్రి మాటల్లోనే అర్ధమవుతున్నాయి. ప్రజారోగ్యం మెరుగుపడాలంటే ముఖ్యమంత్రి వైద్యశాలలు ఏర్పాటు చేస్తే కాదని, గ్రామస్థాయిలో పారామెడికల్ సిబ్బందిని నియమించాలని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ఆ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వెనుకబడి ఉన్నదని గణాంకాలే చెబుతున్నాయి. అసలు రోగి రోగాన్ని ఎవరు గుర్తిస్తారనే విషయంపై ప్రభుత్వానికి సరైన క్లారిటీ ఉందా? లేదా? అనే అనుమానాన్ని కూడా విశ్లేషకులు పదే పదే ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వమంటే విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసే ప్రభుత్వమనేది అధికారంలోకి రాకముందు నుంచీ పాతుకుపోయిన నమ్మకం. అయితే, ఇపుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

దానికి కారణం వైద్య ఆరోగ్యశాఖను పూర్తిగా గుత్తేదార్ల చేతుల్లో పెట్టడం. దానికి ప్రధాన ఉదాహరణ ప్రధాన ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఓ ప్రయివేటు సంస్థకు ఇవ్వడం. అవి అన్నిరకాల పారా మెడికల్ సిబ్బంది చేసే ప్రాధమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆ లేబ్‌లలోనే చేయించడం అవికాస్త తప్పుల తడకల రావడం. ఈ విషయం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రులు కూడా గుర్తించడమూ జరిగిపోయాయి. కానీ ఎక్కడా మార్పు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రభుత్వం ద్రుష్టిలో స్టాఫ్ నర్సులు ఉంటే సరిపోతుందనే భావన పూర్తిగా నాటుకుపోయింది. దానికి కారణం వ్యాధి నిర్ధారణ పరీక్షల విభాగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయడమే. ఇక్కడ మాత్రం ఆ సేవలు ఎటూ సరిపోవడం లేదు.

పైగా ప్రభుత్వం ఉచిత వైద్యం, ఉచిత పరీక్షలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లో మెడికల్ సెంటర్లు అత్యధికంగా పెరుగుతున్నాయి దానికి కారణం ప్రాధమిక రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేవారంతా ప్రైవేటు సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని ఆసుపత్రుల్లో ముందు స్టాఫ్ నర్సులు నియమించేస్తే సరిపోతుందని భావిస్తుంది దానికి మరో కారణం కూడా లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాలకు 104 వాహనాలు పంపిస్తున్నామని, అత్యవసర సేవలకు 108 వాహనాలు వెళుతున్నాయని (ప్రస్తుతం డీజిల్ లేక నిలిచిపోయినప్పటికీ) ఆ వాహనాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పుడు ఎందుకు ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలనే దృష్లికి వచ్చింది.

దీంతో వైద్య ఆరోగ్యశాఖలో పారామెడికల్ ఉద్యోగాలు తీయాల్సి వస్తే అది ముందుగా స్టాఫ్ నర్సులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక రకంగా వీరి ఉద్యోగాలు ముఖ్యం అయినప్పటికీ వ్యాధి నిర్ధారణ కాకుండా రోగి ఆసుపత్రిలో ఏ విధంగా ఉండి వైద్యం చేయించుకుంటాడనే కోణంలో మాత్రం ప్రభుత్వం ఆలోచించడం లేదు. పైగా పీహెచ్సీలు, డిస్పెన్సరీల్లో వున్న ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించి శాంపిల్ ఏజెంట్లను నియమించి ప్రయివేటు సంస్థ ద్వారా పరీక్షలు చేయిస్తుంది. నగర పరిధిలో ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే నియామకాలు చేసినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పిహెచ్‌సీలకు మాత్రం ఈ సేవలు అందడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ చిన్న రోగమొచ్చినా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది.

ప్రభుత్వం స్టాఫ్ నర్సులపై పెట్టే దృష్టి వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్ టెక్నీషియన్‌లపై కూడా కాస్త పెడితే గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల స్థాయిలో వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరిగి ప్రభుత్వం అందించే వైద్యసేవలు అందడానికి అవకాశం వుంటుంది. విశేషం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వైద్య సదుపాయాల ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడమే. అయితే తాజా జరుగుతున్న ప్రచారం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు తీయని, ఆ ఉద్యోగాలకు మంగళం పాడటానికే ఆ విభాగాన్ని పూర్తి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఇచ్చేస్తున్నారనేది ఇపుడు అందరి నోటా వినిపిస్తున్నమాట.

వాస్తవానికి రాష్ట్రంలో సుమారు రెండువేలకు పైగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక్క విశాఖ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 120 వరకూ అంటే గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ, ఇటు మైదాన ప్రాంతాలు కలుపుకొని. ఇన్ని ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీచేయడానికి మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఎంతసేపూ ప్రయివేటు సంస్థలనే పైకి తీసుకొచ్చి అన్ని రకాల పారామెడికల్ సేవలను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నట్టు సంకేతాలు ఇస్తోందనేది అందరి వాదన. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను ఆయా సంస్థలకు అనుసంధానించిన విధానాన్ని రద్దు చేసి ఎక్కడికక్కడ ల్యాబ్ టెక్నీషియన్లను నియమించడం ద్వారా ప్రభుత్వ ఆశయం కూడా నెరవేరే అవకాశముంటుందని వక్తలు పేర్కొంటున్నారు.