నిత్యజీవితంలో మనకు అనేక రకాల వంటింటి ఉపాయాలు అవసరం పడుతూ ఉంటాయి. అయితే, వాటిని మనం ఎక్కడో, ఎప్పుడో విన్న గుర్తయితే వస్తుంది గానీ, సమయానికి ఆయా చిట్కాలను మనం ఎలా ప్రయోగించాలో తెలియక తికమకపడుతుంటాం. అందుకే మీ కోసం చిట్టిపొట్టి చిట్కాల సమాహారం… ఉడుకుతున్న క్యాబేజీ వాసన రాకుండా ఉండడానికి అందులో తులసి ఆకును వేయాలి. ఇలా చేయడం వల్ల వాసన తగ్గడమేకాదు క్యాబేజి కూర తులసి ఘుమఘుమలను చిందిస్తుంది.

కమలాపండు, టొమాటో వంటి వాటిని వేడినీళ్లల్లో ఒక నిమిషం పాటు ఉంచి అంతే సమయం చల్లనీళ్లల్లో కూడా పెట్టి తీస్తే వాటిపైనున్న తొక్కును సులభంగా తీయొచ్చు. ఉల్లిపాయలు వేయించేటప్పుడు అందులో కొద్దిగా చక్కెర వేస్తే అది తొందరగా పింక్‌ లేదా బ్రౌన్‌ రంగులోకి వస్తుంది. కోడిగుడ్డు పగలగొట్టి అందులో రెండు మూడు స్పూన్ల పాలు కలిపితే ఆమ్లెట్‌ స్పాంజిలా మృదువుగా వస్తుంది. కూరలు చేసే పాన్‌లో కొద్దిగా ఉప్పు వేస్తే నూనె పైకి చిందదు. రాజ్మా, మినపప్పులను ఉడకబెట్టేటప్పుడు అందులో ముందుగానే ఉప్పు వేయద్దు. అలా చేస్తే అవి ఉడకడానికి చాలా టైమ్‌ పడుతుంది.

ఫ్రిజ్‌లో గడ్డకట్టుకున్న మాంసాన్ని కుళాయి నీళ్ల కింద పెడితే కొద్ది సేపటిలోనే మామూలు స్థితికి వస్తుంది. నీరు ఆదా చేయాలనుకున్నా, ఇంకొద్దిగా స్పీడుగా పని అవ్వాలనుకున్నా గడ్డకట్టిన మాంసాన్ని అల్యూమినియం షీట్‌ లేదా ట్రేలో పెడితే సాధారణ స్థితికి వస్తుంది. అల్యూమినియంలో వేడెక్కువ. ఇవి పరిసరాల్లోని వేడిని వేగంగా గ్రహించి దాన్ని గడ్డకట్టిన మాంసంలోకి పంపుతుంది. దాంతో మాంసం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. ఇక, వంటల్లో చాలా మంది అరుదుగా వినియోగించే వేరుశనగ నూనెలో చాలా ఉపయోగాలు దాగి ఉన్నాయంటే నమ్మడానికి సందేహిస్తుంటాం.

కానీ, ఇది నిజం. చాలా పరిశోధనల్లో రుజువయింది కూడా. ఉన్న రెస్వెట్రాల్‌, పోలీఫెనాల్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్‌ తొలగించడానికి పనిచేస్తుంది. అలాగే వేరుశనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. నూనెలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.