బెంగళూరు, జులై 30 (న్యూస్‌టైమ్): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. కనిపించకుండా పోయిన సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే, ఇప్పటి వరకూ సిద్ధార్ధ మరణానికి కారణాలు మాత్రం తెలియలేదు.

సిద్ధార్ధ తొలుత అదృశ్యమైనట్లుగా భావించినప్పటికీ చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాయడంతో సిద్దార్థ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ సూసైడ్ నోట్‌ను ధ్రువీకరించాల్సి ఉంది. కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు సిద్ధార్ధ రాసిన లేఖలో పలు విషయాలు వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. 37 ఏళ్ల తన కృషిలో 30 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించానని, అయితే ఇప్పుడు ఎన్నో మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నానని ఆ లేఖలో వాపోయారు.

ఇక తనకు పోరాడే ఓపిక లేదని, అందుకే అన్ని వదిలేస్తున్నానని, ఓ ప్రైవేట్ ఈక్విటీలో భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని తనను బలవంత పెడుతున్నారని, ఇక ఆ ఒత్తిడిని తాను తీసుకోవాలనుకోవట్లేదని లేఖలో పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆదాయపు పన్ను మాజీ డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని, తనపై మీరంతా బలంగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నానని, తన తప్పులన్నింటికీ తనదే బాధ్యత అనీ పేర్కొన్నారు.

తన లావాదేవీల గురించి తమ మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదని, వాటన్నింటికీ తనే జవాబుదారినని, అయితే, తను ఎవరినీ మోసం చేయాలనుకోలేదని, తనొక అసమర్థ వ్యాపారవేత్తని, తనను క్షమించండి అంటూ సిద్ధార్థ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని సిద్ధార్ధ ఆదేశించారట. అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.

సాయంత్రం 6.30 గంటల వరకు సిద్ధార్ధ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారట. కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురై వెంటనే విషయాన్ని సిద్ధార్థ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పట్టారు.

కాగా, విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్.ఎం. కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం కృష్ణను కలిశారు.