హైదరాబాద్, జులై 31 (న్యూస్‌టైమ్): తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ కవి గోరేటి వెంకన్నకు సినారె అవార్డును రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

‘సినారె వైభవం’ పేరుతో తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి, రాష్ట్ర సంగీత నాటక పరిషత్తు చైర్మన్ బాద్మి శివకుమార్, కవులు యాశీన్, డాక్టర్ చెన్నయ్యలతో పాటు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కవులను, కళాకారులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి గౌరవిస్తున్నామన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి తెలుగు భాషకు ఎంతో ఘన కీర్తి, ప్రతిష్టతలు తీసుకువచ్చారన్నారు. వారు అందించిన సేవల వల్ల తెలంగాణ సాహిత్యం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డాక్టర్ సినారె అవార్డుకు ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ, ప్రముఖ కవి గోరేటి వెంకన్నను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.