హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతానికి నీటి కష్టాలు తప్పాయి. ఎగవ ప్రాంతాలలో విరివిగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి ప్రవాహాలు పెరగడంతో దిగువ ప్రాంతాల్లోని జలాశయాల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. గోదావరిలో ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి ప్రవాహం లేకపోయినా, దిగువన భారీ ప్రవాహం ఉంది.

బుధవారం మేడిగడ్డ బ్యారేజీ 57 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పోలవరం వద్ద 6.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదుల నుంచి ఎక్కువగా ప్రవాహం ఉంది. ఈ నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా నదిలో వరద నిలకడగా ఉండగా గోదావరిలో పెరుగుతోంది. ఆలమట్టిలోకి లక్షా 76 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు.

నారాయణపూర్‌ రిజర్వాయర్‌లోకి 2.11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూరాలలోకి లక్షా 80 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, శ్రీశైలంలోకి 2,16,346 క్యూసెక్కులు ఉంది. జూరాల నుంచి కాలువలకు నీటిని విడుదల చేయడంతోపాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదీ ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక వర్షపాతం నమోదైనందున ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గోదావరిలో సింగూరు, నిజాంసాగర్‌, శ్రీరామసాగర్‌లోకి ఎలాంటి ప్రవాహం లేదు. దిగువన కడెంలోకి 20 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 13 వేల క్యూసెక్కులు ఎల్లంపల్లికి వదిలారు. ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహం కాళేశ్వరం దగ్గర 3.84 లక్షల క్యూసెక్కులు ఉండగా మేడిగడ్డ గేట్లు ఎత్తి 5.31 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.

ఇంద్రావతి నుంచి 40వేల క్యూసెక్కులతోపాటు శబరి నుంచి ఎక్కువ ప్రవాహం రావడంతో పోలవరం వద్ద 6.75 లక్షల క్యూసెక్కుల వరద ఉంది. పోలవరం స్పిల్‌వే రివర్‌స్లూయిస్‌ గేట్ల ద్వారా వరద నీటిని బయటకు వదులుతున్నారు. గోదావరికి వరద ఉద్ధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఒకదానికి ఒకటి మించి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం ముప్పై గేట్లు మాత్రమే తెరచి ఉంచగా సాయంత్రం వరకు భారీగా వరద నీరు చేరడంతో 57 గేట్లను ఎత్తారు. వరుస క్రమంలోని 23 నుంచి 80 వరకు గేట్లను నాలుగు మీటర్ల మేర తెరిచి ఉంచారు. ఇన్‌ఫ్లో 3,84,800 లక్షల క్యూసెక్కులు ఉండగా 5,31,200 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 7.0 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కన్నెపల్లి పంపుహౌస్‌ పంపులు మంగళవారం నుంచి నిలిచిపోయే ఉన్నాయి. కాళేశ్వరం వద్ద ఉభయనదుల ప్రవాహం పెరగడంతో పంపులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 9 మీటర్ల (29 అడుగులు)మేర ప్రవాహం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39 అడుగులు దాటింది. మరోవైపు, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 24 గేట్ల ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని వదిలారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాలకు 19,609 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రెండు విద్యుత్తు కేంద్రాల ద్వారా 11 యూనిట్లలో 299 మోగావాట్ల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. బుధవారం వరకు ఎత్తిపోతల పథకాలతోపాటు శ్రీశైలం జలాశయానికి 1.759 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు జూరాల ప్రాజెక్టు ఈఈ శ్రీధర్‌ తెలిపారు. ఈ నీరు గురువారం ఉదయానికి శ్రీశైలం చేరుకుంది.

కాగా, తెలంగాణలో గోదావరి, కృష్ణా బేసిన్లలో నీటి ప్రవాహాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. జూరాల నుంచి విడుదలవుతున్న కృష్ణా జలాలు గురువారం ఉదయానికి శ్రీశైలం జలాశయానికి చేరుకోనుండగా, ఇటు గోదావరిలో కాళేశ్వరం వద్ద మూడు లక్షల క్యూసెక్కులకుపైగా ప్రాణహిత జలాలు పెద్దఎత్తున వచ్చి కలుస్తున్నాయి. మరోవైపు, ఇంద్రావతి నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి కలుస్తుండటంతో పేరూరు వద్ద గోదావరి ఏడు లక్షల క్యూసెక్కులతో ఉగ్రరూపందాల్చింది.

కృష్ణా, గోదావరి బేసిన్లలోని వివిధ భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు లక్షలు, వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు వస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో లింక్ విజయవంతమైంది. మేడిగడ్డ బ్యారేజ్‌ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎదురు ప్రయాణం ప్రారంభించిన ప్రాణహిత జలాలు అన్నారం, సుందిల్ల బరాజ్‌లను నింపుకొని, ఇప్పుడు సుందిల్ల పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి చేరుకోవడంతో లింక్- 1 పరిపూర్ణమైంది.

దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు కీలకమైన మైలురాయిని అధిగమించినట్టయింది. కర్ణాటకలోని ఆల్మట్టికి 1,19,850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. వరద ఇలాగే కొనసాగుతుందని సీడబ్ల్యూసీ కూడా పేర్కొనటంతో దిగువకు ఎక్కువ నీటిని వదులుతున్నారు. ఆల్మట్టి స్పిల్‌వే ద్వారా 1,33,563 క్యూసెక్కులు, విద్యుత్‌ప్లాంట్ల నుంచి 42,000 క్యూసెక్కులు నదిలోకి విడుదలవుతున్నాయి. నారాయణపుర జలాశయానికి 1.93 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతుండటంతో డ్యాం 24 గేట్లు ఎత్తి 1,85,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

బుధవారం రాత్రి 10 గంటలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు 2,05,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 24 గేట్ల ద్వారా 2,21,5321 క్యూసెక్కులను దిగువనకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు ఇప్పటికే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను చేరుకోగా అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం ఆరుగంటల వరకు శ్రీశైలం జలాశయానికి 1,62,444 క్యూసెక్కుల నీళ్లు చేరుకుంటాయని కేంద్ర జలసంఘం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావం చూస్తుంటే సుమారు వారంపాటు ఆల్మట్టి, నారాయణపుర నుంచి దిగువకు ఔట్‌ఫ్లో ఇదేస్థాయిలో కొనసాగే అవకాశం ఉన్నదని అంటున్నారు.

ఆల్మట్టికి గురువారం ఉదయం 8 గంటలకు 2,11,884 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో నారాయణపురకు 1,94,227 క్యూసెక్కులు వచ్చింది. బుధవారం ఉదయం జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి అది 1,90,000కు పెరుగడంతో ప్రాజెక్టు పూర్తి నిల్వసామర్థ్యానికి చేరుకుంది. 318.516 మీటర్ల పూర్తి సామర్థ్యానికిగాను 318.500 మీటర్ల స్థాయిలో నీటిని ఉంచి వచ్చిన నీటిని వచ్చినట్టే గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాలకు వరద బాగా ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలన్నింటినీ వెంటనే నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దిగువకు నీటి విడుదల దృశ్యాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలో మత్స్యకారుల వద్ద లభించే వివిధరకాల చేప వంటకాలను ఆరగిస్తున్నారు. ఇదిలాఉంటే కృష్ణా బేసిన్‌లోని డిండి, మూసీ, కోటిపల్లి, పాకాల, వైరా, లంకాసాగర్, బయ్యారం తదితర ప్రాజెక్టులకు కూడా వరద వస్తోంది.

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ పంప్‌హౌస్ నుంచి రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్-1కు కృష్ణానది నుంచి నీటి పంపింగ్ కొనసాగుతోంది. మరోవైపు, తుంగభద్రకు వరద స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి వరకు 14,613 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. భీమా నది ద్వారా ఉజ్జయిని ప్రాజెక్టుకు 58 వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ఇదిగో! ఆంధ్రప్రదేశ్ రైతుల ఏడు దశాబ్దాల కల… గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఐదేళ్ళ కష్టం… పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దేశంలోనే అతిపెద్ద స్పిల్ వే దాటి ప్రవహిస్తోంది గోదావరి. అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేసి గేట్లుపెట్టి నీళ్ళిచ్చే పరిస్థితి ఉండేది.