విశాఖపట్నం, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): విద్యారంగంలో నాణ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యత కల్పిస్తామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం ఉదయం ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన వర్సిటీ ప్రిన్సిపాల్స్‌తో సమావేశమయ్యారు. ముందుగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందన్నారు. దీనిలో భాగంగానే విద్యకు 15.7 శాతం నిధులను బడ్జెట్‌లో కేటాయించామన్నారు. అందరికీ విద్యను చేరువ చేయడం తమ ప్రభుత్వ లక్ష్యంగా నిలుస్తోందన్నారు. అందరికీ ఉన్నత విద్య చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు.

మహానేత వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ఆలోచనతో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు సైతం సాంకేతిక విద్య చేరువ చేసిందన్నారు. గతంలో ఆస్తులమ్మి చదివించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉండేదని, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. పేదవారు సైతం తమకు నచ్చిన విద్యను అభ్యశించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. విద్యా రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం జరుగుతోందన్నారు. ప్రతిభే కొలమానంగా నియామకాలు జరుపుతామన్నారు.

పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. విద్యను కార్పొరేటీకరణ చేయడానికి తాము వ్యతిరేకమన్నారు. ఏయూకు అవసరమైన ఆర్ధిక తోడ్పాటును పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విద్యను కార్యరూపంలో చూపుతామన్నారు.

కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణ మోహన్‌, అకడమిక్‌ డీన్‌ ఆచార్య కె.వెంకట రావు, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య కె.రామ మోహన రావు, పేరి శ్రీనివాస రావు, టి.వినోద రావు, ఎస్‌.సుమిత్ర, ఎం.ప్రమీల దేవి, శివ ప్రసాద్‌, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వర్సిటీ తరపున మంత్రి ఆదిమూలపు సురేష్‌ను సత్కరించి, పుస్తకాలను బహూకరించారు.