చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల బాధలను పాదయాత్రలో తెలుసుకుని, మద్యం సేవించడం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం కావడం చూసి మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తామని తెలిపారని, దీన్ని దశల వారీగా అమలు చేయడం జరుగుతుందన్నారు.

పేదల బాధలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమాన్ని వాటి వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూమిని అధికారులు గుర్తించాలన్నారు. ప్రతి పేద వానికి 1.5 సెంట్ భూమిని అందజేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, రానున్న ఉగాది నాటికి పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తాను ఉప ముఖ్యమంత్రి అనే భావన లేకుండా అందరం ఒక కుటుంబంలా పని చేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా జిల్లాలో సమర్థవంతంగా పని చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి మండలంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు.

కింది స్థాయి సిబ్బంది నుండి అవినీతి లేకుండా పని చేయాలని ఇది ముఖ్యమంత్రి తపన అని వారి ఆశయాల సాధనకు అధికారులందరూ సమిష్టి కృషితో పని చేయాలన్నారు. పెంచిన పెన్షన్‌లను ఈ సంవత్సరం రూ.2250/-, 2వ సం. రూ. 2500/-, 3 వ సం. 2750/-, 4వ సం.3000/- ఇవ్వనున్నట్లు తెలిపారు. రాస్త్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ చేరవేయాలని అందుకు అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలన్నారు. సమీక్షా సమావేశానికి విచ్చేసిన మంత్రి, శాసన సభ్యులకు పుష్పా గుచ్ఛంతో అధికారులు తొలుత స్వాగతం పలికారు.

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తేనె తయారీకి సంబంధించి అరణ్య బ్రాండ్‌తో తయారు చేసిన చిత్తూరు తేనె బాక్స్‌లను, వనం – మనం కార్యక్రమంపై కరదీపికలను, చిత్తూరు జిల్లాలో జనవరి 26 నాటికి పూర్తి స్థాయి ప్లాస్టిక్ నిషేధంపై తయారు చేసిన కరదీపికలను మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్సీ రాజసింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జెసి డి.మార్కండేయులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిష పి.ఎస్., జెసి 2 చంద్రమౌళి, డిఆర్ఓ విజయ్‌చందర్, చిత్తూరు, తిరుపతి ఆర్డిఓలు రేణుక, కనకనరసా రెడ్డి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.