• రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తిచూపిన ఆదాల

  • బిట్రగుంటలో పరిశ్రమను త్వరగా ఏర్పాటు చేయాలంటూ డిమాండు

నెల్లూరు, ఆగస్టు 2 (న్యూస్‌టైమ్): నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్‌గా పేరుగాంచిన బిట్రగుంట మరోసారి పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. ఇక్కడ రైల్వే పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఎత్తిచూపుతూ నెల్లూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని చర్చకు తీసుకువచ్చారు.

కాంక్రీట్ స్లీపర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కానీ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మెయింటినెన్స్ సెంటర్‌ను కానీ లేదా క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్‌షాప్‌ను కానీ బిట్రగుంటలో ఏర్పాటు చేయాలని ఆదాల విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అయినా సంబంధిత వర్గాలు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, అందువల్ల ఇది కార్యాచరణకు నోచుకోలేదని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా ఫలితం లేకుండా ఉందని చెప్పారు. బిట్రగుంటలో 1100 ఎకరాల రైల్వే స్థలం ఈ కారణంగా వృధాగా ఉందని గుర్తు చేశారు. దేశంలోనే పెద్దదైన లోకో షెడ్‌లలో బిట్రగుంట లోకో షెడ్ ఒకటని పేర్కొన్నారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లు రావడం వల్ల ఈ షెడ్డు మూతపడిందని తెలిపారు.

1885లో నిర్మితమైన ఈ షెడ్‌లో 1934లో రౌండ్ హౌస్ ఏర్పాటయిందని చెప్పారు. ఇక్కడ 50 లోకోమోటివ్ ఇంజన్ల సామర్థ్యం ఉండేదని, దాంతోపాటు మేజర్ యార్డు కూడా కలిగి ఉందని తెలిపారు. పాసింజరు ఎక్స్ప్రెస్ రైళ్లకు డ్రైవర్లు, గార్డులను మార్చే కేంద్రంగా ఉండేదని, ఇప్పటికీ పరిమితంగా అయిన ఆ పని చేస్తూనే ఉందని తెలిపారు.

ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నందున తక్షణం ఒక రైల్వే ప్రాజెక్టును చేపట్టి పూర్వవైభవాన్ని తేవాలని కోరారు. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాన్ని ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా న్యాయం చేయవచ్చునని విజ్ఞప్తి చేశారు. తక్షణం రైల్వే శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.