భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 2 (న్యూస్‌టైమ్): గోదావరి పరవళ్లు తెలుగు రాష్ట్రాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 .6 అడుగులకు చేరింది. భద్రాచలానికి ఎగువ ప్రాంతాలలో అన్నిచోట్లా గోదావరి నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దుమ్ముగూడెం, పేరూరు, పాతగూడెం, కాళేశ్వరం వంటి ప్రాంతాలో ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం చోటుచేసుకున్న పరిస్థితి దర్శనమిస్తోంది.

అన్ని చోట్ల గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్నట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు చెప్పారు. మరోవైపు, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 43 అడుగులకు గోదావరి నీటిమట్టాలు భద్రాచలం వద్ద చేరుకున్న నేపథ్యంలో ముంపు ముప్పును తప్పించుకునేందుకు, దిగువ ప్రాంతాల్లోని వారిని అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమయింది. చత్తీస్‌గఢ్, ఒడిశాలలో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం దిగువ ప్రాంతంలోని శబరి, ఎగువ ప్రాంతాలలో కలిసే తాలిపేరులలోకి భారీగా నీరు చేరుకుంటోంది.

ప్రస్తుతం తాలిపేరు డాం 22 గేట్లను ఎత్తివేసి 1 .5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఒకవేళ శబరి ఉధృతి అనూహ్యంగా పెరిగి ఆంధ్రలోని కూనవరం దాటిన తర్వాత గోదావరి ప్రవాహసానికి అడ్డుపడితే భద్రాచలం వద్ద నీటి మట్టాలు కొంతమేర పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ములుగు జిల్లాలోని అందాల బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా పొంగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకులు రావొద్దని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు.

‘‘వర్షాల ధాటికి బొగత జలపాతం వద్దకు భారీగా వరద నీరు చేరుకుంది. వరద తీవ్రత తగ్గే వరకూ పర్యాటకులు ఇక్కడికి రాకపోవడం మంచిది. ఒకవేళ వచ్చినా అటవీ సిబ్బంది సూచనల మేరకు ఫెన్సింగ్‌ దాటి వెళ్లకూడదు. మద్యం సేవించి వచ్చే పర్యాటకులను అనుమతించేది లేదు. నిబంధనల విషయంలో సిబ్బందికి సహకరిస్తారని కోరుకుంటున్నాం’’ అని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.

ఇంకోవైపు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఈ నెల 5 వరకు ఈదురు గాలుల తీవ్రత ఉంటుందని వివరించింది. గంటకు 70కి.మీల వేగంతో గాలులువీచే సూచనలు ఉన్నాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తువరకు ఎగిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో వర్షాలు కురుస్తున్నాయి. తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో నాలుగు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు.

మొత్తానికి గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టింది. స్పిల్‌వే వైపునకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాఫర్‌ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు ఉండడం వల్ల వరదను స్పిల్‌వే మీదుగా మళ్లించారు. దాదాపు 2 వేల క్యూసెక్కుల వరద నీరు స్పిల్‌వే రివర్స్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. స్పిల్‌వే గేట్ల క్లస్టర్‌ లెవెల్‌ ఎత్తు 25.72 మీటర్లుకాగా ప్రస్తుతం నీరు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరో అరమీటరు ఎత్తు పెరిగితే వరద నీటిని విడుదల చేయనున్నారు. స్పిల్‌వేపై నుంచి వరద నీరు సాఫీగా వెళ్తుండటం వల్ల ముంపు గ్రామాలకు కొంత వరకు ముప్పు తప్పిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది.

బ్యారేజీ లోకి 6.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 6.39లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా, కృష్ణమ్మ వేగం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు దిగువకు 2,10,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద ఎక్కువగా వచ్చి చేరుతుండటంతో దిగువకు ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 832.30 అడుగులుగా ఉంది.

జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలుకాగా మూడు రోజుల కిందట ప్రారంభమైన వరదతో 51.96 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు, ఆల్మట్టి నుంచి వస్తున్న ప్రవాహం కూడా 2 లక్షల క్యూసెక్కులను దాటింది. నారాయణపూర్‌ నుంచి 19 గేట్లను 2 మీటర్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.