ముంబయి, ఆగస్టు 8 (న్యూస్‌టైమ్): మహారాష్ట్రలో వరద తీవ్రతతో 16 మంది మరణించగా పెద్దసంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. భారీ వర్షాలతో షోలాపూర్‌, సంగ్లి, సతారా, కొల్హాపూర్‌, పూణే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి 1,40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు పనిచేయడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూణే జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు.

వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం, వైద్య సేవలతో పాటు నిత్యావసర వస్తువుల సరఫరా వంటి సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ, కోస్ట్‌ గార్డ్‌ దళాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ఇక భారీ వర్షాలతో పూణే, సతారా, సంగ్లీ, కొల్హాపూర్‌ జిల్లాల్లోని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరోవైపు, మహారాష్ట్రలో కుంభవృష్టి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న అతిభారీ వర్షాలకు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. పుణె,కొల్హాపూర్‌, సంగ్లీ, సతారా జిల్లాల్లో వరద పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండటంతో 16 మంది మృత్యువాత పడ్డారు. 1.3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

నివాస ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జాతీయ విపత్తు సహాయబృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. పంచార్‌ నుంచి వాయుమార్గం ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. కొల్హాపూర్‌ జిల్లాలో వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొల్హాపూర్‌ జిల్లాలోని చిక్లీ, షిరోలి ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లుపైకప్పు ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరద బాధితులు ఇళ్లపైకప్పుపై ఆశ్రయం పొందుతుండగా.. జాతీయ విపత్తు బృందాలు లైఫ్‌ బోట్ల ద్వారా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. సంగ్లీ జిల్లాలోనూ వరద ఉద్ధృతి ఎక్కువగానే ఉంది.

ఓల్వా, పలూస్‌, ఇస్లాంపూర్‌ ఆవాస ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వీధుల్లోనూ మోకాళ్లలోతు వరద నీరు నిలిచింది. పుణె, సతారా, కొల్హాపూర్‌ జిల్లాల్లో, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగ్లీ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు మూడు రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారుతో పాటు పుణె, సతారా, కొల్హాపూర్‌ జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.

రాష్ట్ర, జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేశాయి. కాగా, వరద పరిస్థితులను పర్యవేక్షించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఏరియల్‌ సర్వే చేయనున్నారు. కొల్హాపూర్‌లో పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ అక్కడ పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. 28,397 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని పోలీస్‌ కమిషనర్‌ దీపక్‌ మహైసేకర్‌ తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం 22 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఘటనాస్థలంలో ఉంచామన్నారు. వీరితోపాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలు కూడా రంగంలోకి దిగాయని తెలిపారు. సంగ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడటంతో 14 మంది దుర్మరణం చెందారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30 మందితో బయల్దేరిన ఈ పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను గురువారం బయటకి తీశారు. మరో మూడు మృతదేహాలు వరదలో కొట్టుకొని పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. గతవారం రోజులుగా కొల్హాపూర్‌, సంగ్లీ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల ధాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.

1.3లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. నివాస ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జాతీయ విపత్తు సహాయబృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుసున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

డెల్టాకాల్వలకు 7000క్యసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద నిలకడగా ఉంది. పోలవరం, వేలేరుపాడు మండలంలోని 36 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.