అమరావతి, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): జర్నలిస్టుల హెల్త్ కార్డుల రెన్యూవల్‌కు ఈ నెల చివరి వరకు గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఅండ్‌పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చారు. గతంలో నిర్ణయించిన మేరకు గడువు ఈరోజుతో ముగిసింది.

మంగళవారం సచివాలయంలో వేర్వేరుగా తనను కలసిన వివిధ జర్నలిస్టుల సంఘాల నేతలతో చర్చించిన మేరకు సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి గడువు పొగిస్తున్నట్లు హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వి. సుబ్బారావు, చందు జనార్దన్, ఐజేయూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఆలపాటి సురేష్, నేషనల్ యాక్టివ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) అధ్యక్షుడు బండి సురేంద్రబాబు తదితరులు ఉన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు పొగించడం పట్ల ఎన్.ఎ.ఆర్.ఎ. అధ్యక్షుడు బండి సురేంద్రబాబు ఒక ప్రకటనలో హర్షం తెలిపారు. వృత్తిపరమైన శ్రమలో తమ జీవితాలను ఫణంగా పెట్టి నెట్టుకువస్తున్న జర్నలిస్టుల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉదారస్వభావంతో ఆలోచించడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హులైన జర్నలిస్టులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా ఆరోగ్య బీమాను వర్కింగ్ జర్నలిస్టులందరికీ వర్తింపజేయాలన్న తమ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ దిశగా మరింత మంది వర్కింగ్ జర్నలిస్టులు లబ్దిపొందే అవకాశం ఉందన్నారు.

ఆన్‌లైన్‌లో వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ నమోదు ఇలా…

వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్‌కు సంబంధంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 1250 రూపాయలను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. దీని కోసం అర్హులైన జర్నలిస్టులు cfms.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే సిటీజన్ సర్వీసెస్ కనిపిస్తుంది… దానిపై క్లిక్ చేయగానే… ప్రారంభంలోనే రిసెపిటిస్ లింక్స్ కింద పీడీ చలానా ఉంటుంది.

పీడీ చలానా క్లిక్ చేయగానే

డిపార్టుమెంటు, సర్వీస్ అని రెండు కాలమ్స్ వస్తాయి.

డిపార్టుమెంటు కాలమ్‌లోకి వెళ్లి దిగువన ఉన్న GDO2 లింక్‌ను క్లిక్ చేయాలి.

సర్వీస్ కాలమ్‌లో 7036 నెంబర్ రాయాలి. వెంటన్ పీడీ చలానా ఓపెన్ అవుతుంది.

తొలి మూడు కాలమ్స్ అప్పటికే నింపి ఉంటాయి.

జిల్లా వున్న కాలమ్‌లో 27 ఏపీ క్యాపిటల్ రీజియన్ అని టైపు చేసి కింద వున్న ట్రెజరీ కాలమ్‌లో 2703అని టైపు చేస్తే ఏపీ స్టేట్ క్యాపిటల్ రీజియన్ అని వస్తుంది.

కింద వున్న DDO కాలమ్‌లో 27030802003ని ఎంటర్ చేసి సబ్‌మిట్ దగ్గర క్లిక్ చేయగానే వచ్చే ఫారంలో మన డిటైల్స్ నింపగానే…

కింద నెట్ బ్యాంకింగ్, మాన్యువల్, ఆర్టీజీస్ ఆప్షన్లు వస్తాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయగానే చలనా వస్తుంది. దాన్ని డౌన్‌లోడు చేసుకొవాలి.

ఒకవేళ మాన్యువల్ అయితే డీటెయిల్స్ నింపిన పారాన్ని (చలనా) డౌన్‌లోడ్ చేసుకొని బ్యాంక్‌లో పేమెంట్ చేసిన తర్వాత చలనా ఇస్తారు.

చలానాను, అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డుల (రెన్యూవల్స్ వారు అయితే) జెరాక్స్‌ను సంబంధిత డీపీఆర్వో కార్యాయలంలో అందచేయాల్సి ఉంటుంది.