హైదరాబాద్, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): 1980వ సంవత్సరం… ఊటీలో నందమూరి తారక రామారావు ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా చిత్రీకరణ సమయం. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇంతకాలం తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదో కొంత సేవ చేస్తానని, ఇకపై నెలకు 15 రోజులు వారి సేవకు కేటాయిస్తానని అన్నారు ఎన్టీఆర్. అంతే! వారం రోజుల తర్వాత చూస్తే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రజల నుంచి గోనె సంచుల్లో వేలకొద్దీ ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాలు ఎన్టీఆర్‌ను పూర్తి రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించాయి. అటు సినీ రంగంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తారనే వార్త విన్న నిర్మాతలు ఎన్టీఆర్‌తో సినిమాలు చేసేందుకు పోటీ పడ్డారు.

ఇదిలా సాగుతుండగా ఎన్టీఆర్ తన సినిమాలను తాను చేసుకుంటూ మరోవైపు, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించసాగారు. చివరికి అనుకున్న సుముహూర్తం రానే వచ్చింది. 1982 మార్చి 21న అంటే 37 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున సాయంత్రం గం. 6.15 నిమిషాలకు హైదరాబాదులోని రామకృష్ణా స్టూడియో, మినీ ప్రివ్యూ థియేటర్లో విలేఖరుల సమక్షంలో తన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన చేశారు ఎన్టీఆర్. తాను ఊటీలో సినిమా షూటింగ్ ముగించుకుని వచ్చాక మార్చి 29న పూర్తి వివరాలు ప్రకటిస్తానని తెలిపారు. ఆ వార్త అప్పటికప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తల ద్వారా తెలుగు ప్రజానీకానికి తెలిసి తెలుగునేల మురిసింది.