అమరావతి, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకునేలా ఉంది. దీనిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఎట్టకేలకు స్పందించారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే వారికి మద్దతుగా వరప్రసాద్‌ వెళ్లారని, అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడితే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. మలికిపురం ఘటనలో స్టేషన్ బెయిల్‌తో పోయేదాన్ని గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చినట్లు శాంతిభద్రత సమస్యగా తయారుచేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికార యంత్రాంగం పరిష్కరించాలన్నారు.

జనసేన కార్యకర్తలు, నాయకులు సంయమనంతో ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిన పక్షంలో పరిస్థితులు చేయిదాటితే మాత్రం తానే స్వయంగా రాజోలుకు వచ్చి మద్దతుగా నిలబడతానన్నారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షిస్తున్నట్టు పవన్‌ చెప్పారు. మరోవైపు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను అరెస్టు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీస్‌ స్టేషన్‌వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అనుచరులు చేరుకున్నారు.

రాపాకను కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, అనుచరులు నినాదాలు చేయడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు జనసేన కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి ఎమ్మెల్యే రాపాకను పోలీసులు కోర్టుకు తరలించి హాజరుపరిచారు.