కీలక రంగాలు మళ్లీ గాడిలోపడ్డాయి. గడిచిన కొన్ని నెలలుగా మందకొడి వృద్ధిని నమోదు చేసుకున్న ఎనిమిది కీలక రంగాలు గడచిన త్రైమాసికంలో 4.7 శాతానికి చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. బొగ్గు, ఇంధనం, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు కలిసిన ఈ ఎనిమిది కీలక రంగా లు 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను 4.3 శాతం వృద్ధిని కనబరిచినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

గత నెలలో బొగ్గు ఉత్పత్తి ఫ్లాట్‌గా 9.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ విభాగాలు సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కానీ, ఇంధన ఉత్పత్తి 6.2 శాతానికి పరిమితమవగా, విద్యుత్ ప్రొడక్షన్ 1.4 శాతానికి పడిపోయింది. క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి భారీగా పడిపోవడంతో ఫిబ్రవరి నెలలో కీలక రంగాల్లో వృద్ధి 2.1 శాతానికి పరిమితమైంది. దీంతో దేశ పారిశ్రామిక రంగంలో 41 శాతం వాటా కలిగిన కీ లక రంగాలు అంతంత మాత్రంగానే ఉండటం తో వీటిపై కూడా ప్రభావం చూపనున్నాయి.

కాగా, దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో మహా విలీనానికి తెరలేవనుంది. ప్రపంచ శ్రేణి బ్యాంకుల ఆవిర్భావంలో భాగంగా ఇంకో మూడు పీఎస్‌బీలను ఏకం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనం జరిగిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎస్‌బీఐలో దాని ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ)నూ కలిపేసిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లను ఒక్కటి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.

బ్యాంకింగ్ రంగంలో మరో దఫా విలీనాలపై చర్చించేందుకు ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు పిలుపు రావచ్చు అని ఓ ప్రముఖ జాతీయ వార్తా పత్రికతో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అన్నారు. ఇందులో పీఎన్‌బీ, యూబీఐ, బీవోఐ కూడా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లోగాని, మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లోగాని బ్యాంకుల విలీనానికి అవకాశాలున్నాయని తెలుస్తోంది. బ్యాంకుల విలీనాల విషయంలో కేంద్రం ఎంతోకాలం వేచి చూడబోదు. బ్యాంకులు తమకున్న అవకాశాలను అందిపుచ్చుకోకపోతే ప్రత్యామ్నాయ వ్యవస్థ సూచనలిస్తుంది. దాని ప్రకారం విలీనాలు జరుగుతాయి అని సదరు అధికారి స్పష్టం చేశారు.

గతేడాది అక్టోబర్‌లో బీవోబీ, విజయా, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీవోబీలో విజయా, దేనా బ్యాంక్‌లు కలిసిపోగా, భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకుగా, మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా ఆవిష్కృతమైంది. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ప్రతీ సమస్యకు విలీనమే పరిష్కారం కాబోదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ ఉద్యోగి అన్నారు. మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న క్రమంలో విలీనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది.

మోసాలు, కుంభకోణాలనూ అరికట్టవచ్చని విశ్వసిస్తున్నది. ఒక బ్యాంక్ నుంచి రుణం తీసుకుని, దాన్ని సక్రమంగా చెల్లించకుండానే మరో బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటున్న అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చని కూడా భావిస్తోంది. దీంతో బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం విలీనాలకే మొగ్గు చూపుతోంది. విలీనాలతో బ్యాంకులకు పీసీఏ బాధలు తప్పుతున్నాయి.

ఎన్‌పీఏలు ప్రమాదకర స్థాయిలో ఉన్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా బ్యాంకులకు కొత్త రుణాల మంజూరు, శాఖల విస్తరణ వంటి అంశాల్లో బ్రేకులు పడ్డాయి. అయితే విలీనాల నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక సామర్థ్యం పెరిగి ఆయా బ్యాంకులు పీసీఏ నుంచి బయటపడుతున్నాయి. బీవోబీ విషయంలో ఇదే జరిగింది. అయినప్పటికీ మెరుగైన పనితీరును చూపి పీసీఏ నిబంధనల నుంచి బయటకు వచ్చిన బీవోఐ వంటి బ్యాంకులను విలీనాల పేరుతో మరో బ్యాంకులో కలిపేయడం సరికాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.