అమరావతి, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): మంగళవారం నిర్వహించిన తెలుగుదేశం విస్త్రృత స్థాయి సమావేశం వేదికగా అధికార వైఎస్సార్‌సీపీపైన, ఆ పార్టీ అధినేత జగన్‌పైనా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడి రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అలా చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదనీ తేల్చిచెప్పారు.

విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని పాలక పక్షాన్ని హెచ్చరించారు. మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాటబాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్‌ ‘పులివెందుల పంచాయితీలు’ రాష్ట్రంలో చేయనివ్వమని హెచ్చరించారు. బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపాదాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదన్నారు. సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.

మంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతు పలికామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ‘‘పేదవాడికి రూ.5కే అన్నం పెట్టే ‘అన్న’ క్యాంటీన్లను మూసేశారు. అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వీటన్నిటిపైనా పోరాడేందుకు కార్యాచరణ రూపొందించుకుందాం’’ అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనడం అన్యాయమని చంద్రబాబు ఆరోపించారు.

జగన్‌- కేసీఆర్‌ ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులకు ఆలోచనలు చేయాలని, 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమని అన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని చేసే కార్యక్రమం కాదని చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని హితవు పలికారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని చంద్రబాబు నాయకులకు సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ తెదేపాను నమ్ముకున్న ప్రజలకు అండగా ఉండాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ గెలిచినప్పుడు ఎప్పుడూ విర్రవీగలేదు, ఓడినప్పుడు అధైర్యపడేదీ లేదని, పార్టీకి గెలుపు ఓటములు కొత్తేమీ కాదని అన్నారు. కాగా, విస్త్రృత స్థాయి సమావేశానికి హాజరైన చంద్రబాబు చేతికి స్వల్ప గాయమైంది. దీంతో చేతి నరంపై ఒత్తిడి పెరగడం వల్ల వైద్యులు కట్టు కట్టి ప్రాధమిక చికిత్స చేశారు. కుడిచేతికి కట్టుకట్టుకొని చంద్రబాబు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, తాను తెదేపాను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు.

పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రారంభానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన అనంతరం బొండా మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. తెదేపాలోనే తాను కొనసాగుతానని బొండా స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా బొండా ఉమా తెదేపాను వీడుతారనే ప్రచారం జరిగింది. పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయనతో చర్చలు జరిపారు. తాజాగా చంద్రబాబుతో బొండా భేటీ అయ్యారు.