ఇస్లామాబాద్, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): నింగివైపు చూస్తున్న బంగారం ధరలు పెట్టుబడిదారుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ఆభరణాల వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్‌లు పడే అవకాశాలైతే కనిపించడంలేదు. ముఖ‍్యంగా భారత్ పొరుగు (దాయాది) దేశమైన పాకిస్థాన్‌లో తులం బంగారం ధర వింటే గుండె గుభేల్ మనక మానదు. అవును, నిజం. భారత్‌తో పోల్చిచూస్తే పాకిస్థాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది.

మంగళవారం నాటి పాకిస్థాన్‌ బంగారం మార్కెట్ ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 74,588గా ఉంది. పాకిస్థాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000గా ఉంది. అయితే, ఈ ధర దేశవ్యాప్తంగా ఇకేలా మాత్రం లేదు. ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి.

కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. అదే, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్‌కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తులా బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి.

మరోవైపు, భారత్‌లో దేశీయంగా బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను అధిగమించాయి. అంతేకాదు త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెండి కూడా దాదాపు ఇందే రేంజ్‌లో పరుగులు పెడుతోంది. ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది.