హైదరాబాద్, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో రాఖీపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. సీఎం కేసీఆర్ అక్కాచెల్లెళ్లు లక్ష్మి, విజయ, సకల, వినోద, లలిత హైదరాబాద్ ప్రగతిభవన్‌కు వచ్చి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహిళా నాయకురాళ్లు తుల ఉమ, గుండు సుధారాణి సైతం సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టారు. మరోవైపు, రక్షాబంధన్ సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావుకు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. గురువారం బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన కవిత బొట్టుపెట్టి, హారతి ఇచ్చి కేటీఆర్ పేరుతో ఉన్న రాఖీని కట్టి ఆయనకు స్వీట్ తినిపించారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌కు కవిత రాఖీ కట్టారు. సంతోష్‌కుమార్‌కు ఆయన సోదరి సౌమ్య కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

కొన్ని బంధాలు నిజంగా ప్రత్యేకమైనవి అంటూ కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో రాఖీపండుగ ఫొటోలు షేర్ చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం పలువురు టీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీకట్టినవారిలో మాజీ ఎంపీ సుధారాణి, నాయకురాళ్లు ముక్తవరం సుశీలారెడ్డి, మూల విజయారెడ్డి, సుచిత ఉన్నారు. సీఎం కేసీఆర్ మనుమడు, కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు ఆయన సోదరి అలేఖ్య రాఖీ కట్టి, స్వీట్ తినిపించారు. అనంతరం హిమాన్షు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.