విశాఖపట్నం, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): దేశభక్తి, సమైక్యభావన దేశానికి నిజమైన సంపదలుగా నిలుస్తున్నాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఏయూ బాస్కెట్‌బాల్‌ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు జాతి నిర్మాణానికి వారధులుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మెరుగైన సమాజాన్ని నిర్మించాలనే భావనకు జాతిపిత మహాత్మ గాంధీజీ బాట వేసారని గుర్తుచేసుకున్నారు.

ప్రతీ వ్యక్తి దేశంకోసం తాము ఏమి చేసామని ప్రశ్నించుకుంటూ, ఆదిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య అనే మహావృక్షం నుంచి వచ్చిన జ్ఞానమనే విత్తనాలను నలుమూలలా విస్తరింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. నైతికత, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను, సమిష్టిగా అందిస్తూ నిరక్షరాస్యత, పేదరికం, అవినీతి, టెర్రరిజం, నిరుద్యోగం, కాలుష్యం, బాల కార్మిక వ్యవస్థ, జనాభావిస్పోటనం వంటి సమస్యలకు పరిష్కారాలను చూపడం ఎంతో అవసరమన్నారు. నేటి తరం యువత జ్ఞానంతో సుసంపన్నం కావాల్సిన అవసరం ఉందన్నారు.

దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డి ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థిని ఉపాధిని కల్పించే విధంగా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయడం జరుగుతోందని, దీనిలో ప్రతీ వ్యక్తి భాగం కావాలన్నారు. రానున్న కాలంలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అర్ధవంతమైన అంతర్జాతీయ సదస్సులు, అధికార వికేంద్రీకరణ జరుగుతాయన్నారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఇర్వహిస్తామన్నారు. నవంబరు మాసంలో స్నాతకోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు.

యువతకు నైపుణ్యాలను అందించే చర్యల్లో భాగంగా ఏపిఎస్‌డిసి, నాస్‌కామ్‌లతో అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థిలో స్ఫూర్తిని రగిలిస్తూ అత్యున్నత శిఖరాలను అదిరోహింపచేసే శక్తి ఆచార్యునికి ఉందన్నారు. ఒక పుస్తకం, పెన్‌, ఆచార్యుడు కలిస్తే సమాజ గతిని, విశ్వప్రగతిని మార్చడం సాధ్యపడుతుందని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ముందుగా ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న జాతిపిత మహాత్మగాంధీ విగ్రహం వద్ద పువ్వులు ఉంచి నమస్కరించారు. అనంతరం త్రివిధ దళాల ఉద్యోగులు, ఎస్‌సిసి, ఏయూ సెక్యూరిటీ విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఏయూ సంగీత విభాగం విద్యార్థినులు దేశభక్తి గీతాలను అలపించారు.

కాగా, ఆంధ్రా యూనివర్సిటీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ఏయూ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామ మోహన రావు, ఇంజనీరింగ్‌కళాశాలలో ఆచార్య పేరి శ్రీనివాస రావు, న్యాయ కళాశాలలో ఆచార్య ఎస్‌.సుమిత్ర, సైన్స్‌ కళాశాలలో ఆచార్య టి.వినోద రావు, ఫార్మశీ కళాశాలలో ఆచార్య కె.వి రమణ మూర్తి, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆచార్య ఎస్‌.సుమిత్ర, ఐఏఎస్‌ఇలో ఆచార్య శివప్రసాద్‌, దూరవిద్య కేంద్రంలో ఆచార్య పి.హరి ప్రకాష్‌, వైద్యశాలలో ఆచార్య కె.ఎస్‌.ఎన్‌ మూర్తిలు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.

కార్యక్రమంలో విభాగాధిపతులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏయూ తెలుగు మాధ్యమం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.