విశాఖపట్నం, ఆగస్టు 16 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం లింగ్విస్టిక్స్‌ విభాగం పరిశోధక విద్యార్థి చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌కు డాక్టరేట్‌ లభించింది. ఆచార్య సి.ఆర్‌.ఎస్‌. శర్మ, ఆచార్య ఎల్‌.మంజుల డేవిడ్‌సన్‌ సంయుక్త పర్యవేక్షణలో ‘ది కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఎమోషనల్‌ లాంగ్వేజ్‌- ఏ థిరిటికల్‌ ఫ్రేమ్‌వర్క్‌’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్‌ లభించింది.

ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌కు డాక్టరేట్‌ ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఎమోషనల్‌ లాంగ్వేజ్‌ విధానంలో విద్యార్థులు సులభంగా నూతన భాషలను అభ్యశించే విధానాలను అభివృద్ది చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ దిశగా నవ్యవతతో కూడిన పరిశోధన జరిపి, డాక్టరేట్‌ సాధించిన అభిషేక్‌ను అభినందించారు. ఆంగ్ల భాషను ఒక భావోద్వేగ భాషగా మార్పు చేయడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పరిశోధన సాగిందన్నారు. నూతన విధానం విద్యార్థులను భాష అధ్యయనంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఉపకరిస్తుందన్నారు. తాను అభివృద్ధి చేసిన నూతన అభ్యసన విధానం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అమలు చేయడం ద్వారా సమర్ధవంతంగా, ఉపాధిని కల్పించే దిశగా ఉపకరిస్తుందన్నారు.