అమరావతి, ఆగస్టు 16 (న్యూస్‌టైమ్): పేదల కడుపు కొడుతూ వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది. మొదట రూ.11 కోట్ల ప్రజాధనం వృధా చేస్తూ అన్నక్యాంటీన్ భవనాలకు రంగులు మార్చారు, పథకం పేరు మార్చారు. ఏం చేసుకున్నా ఆకలిగొన్న పేదలకు రూ.5కు అన్నం పెడితే చాలనుకుంది తెలుగుదేశం. కానీ ఈ రోజు పథకాన్ని పక్కనపడేసి ‘అన్న క్యాంటీన్’లను మూసేసింది ప్రభుత్వం.

అటు పేదల నోటికాడి ముద్ద లాగేసింది. ఇటు అన్న క్యాంటీనులలో పనిచేసే వేల మందికి ఉపాధి లేకుండా చేశారు. మొన్నటి వరకు ఒక్కో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు 35 లక్షలు వృధాగా ఖర్చుపెట్టారన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ఒక్కో క్యాంటీన్ మీదా రూ.50 లక్షల అవినీతి జరిగిందని అంటున్నారు. ఖర్చు చేసిందే రూ.35 లక్షలు అన్నప్పుడు రూ. 50 లక్షల అవినీతి ఎలా జరుగుతుందో? అన్న క్యాంటీన్‌లను మూసివేసినందుకు సర్వత్రా విమర్శలు వస్తుండటంతో ఏం చెప్పాలో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ సాకులు చెబుతోంది వైసీపీ ప్రభుత్వం.

అయినా పేదల పక్షాన నిలిచి క్యాంటీన్‌లను తిరిగి తెరిచేవరకు ఉద్యమిస్తోంది తెలుగుదేశం. ఇందులో భాగంగా శుక్రవారం అన్న క్యాంటీన్ల వద్ద పేదలకు అన్నదానం, నాయకుల నిరసన దీక్షలు నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం క్యాంటీనులను తిరిగి తెరిచేలా చేయాలని పిలుపునిచ్చింది.