తెలుగు రాష్ట్రాల్లో భాషప్రజాస్వామీకరణ

జీవన మకరందాన్ని పలికే సజీవ జీవద్భాష

జీవన మకరందాన్ని పలికే సజీవ జీవద్భాష దళితులది. కృత్రిమత్వం అంటని చారిత్రక నేపథ్యం, దళితులకు శ్రమైక భాషాసంస్కృతులని ఇచ్చింది. ఊరే ఊట సెలిమల్లాంటి భాష, ఒక్కచోట ఆగిపోని నది పరుగు దళిత భాషలో యిమిడి ఉంటుంది. అది అయ్యవార్లు గీసిన వ్యాకరణ సూత్రాల కబంధ హస్తాలలో బందీ కాదు. బతుకు ఎట్లుంటుందో భాష అట్లాగే ఉంటుంది. సమాజంలో అట్టడుగున ఉంటున్నా సరే, ఆత్మగౌరవంతో జీవించే దళితుల భాషా సంస్కృతులను గురించి మాట్లాడుకోవాల్సిన తరుణమిది. కెన్యన్ రచయిత గూగీవా థియాంగో ‘భాష ఇద్దరి మధ్య సంబంధాన్ని నెలకొలపడమే కాదు, తెగ్గొడుతుంది కూడా’ అంటాడు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం పండిత భాషకే పట్టం కట్టింది.

సమస్త సంపద సృష్టికర్తలైన దళిత, బహుజన భాషను అంటరానిది చేసింది. రాచరిక పాలనా వ్యవస్థల్లో పాలకులను మెప్పించడానికి సంస్కృత భాషను ఆశ్రయించారు బ్రాహ్మణకవులు. ఆ సంస్కృత భాషను వ్యవస్థీకృతం చేయడానికి కొత్త సూత్రీకరణలను తెర మీదికి తెచ్చారు. ‘ఎల్ల భాషలకు సంస్కృతంబు తల్లి’ అంటూ ప్రచారం చేశారు. ఇదొక కుట్ర. ఆధునిక ప్రపంచాన భాష కేవలం ఒక సమాచార మాధ్యమం మాత్రమే కాదు. అంతకు మించి అదొక రాజకీయ పనిముట్టు. తెలుగు మహాసభలు జరిపే ప్రతీ సారీ భాషా సంస్కృతుల చర్చ ముందుకు వస్తుంది. భాషను తల్లిని చేసి, సంస్కృతికి ఉన్నతిని అద్ది చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తెలుగు భాషా సంస్కృతి అని మాట్లాడేదంతా అగ్రవర్ణ ఆధిపత్యాల భాషా సంస్కృతి గురించే. అందుకే కొన్ని కులాల్లో తెలుగు తల్లి పట్ల, తెలుగు సంస్కృతి పట్ల పెద్దగా కదలిక ఉండదు.

ఈ రెండు భావనల్ని సొంతం చేసుకోలేని స్థితికి ఏనాడో దళిత, బహుజనులను నెట్టి వేశారు. భాషా సాహిత్యాలు తమ జన్మత: వచ్చిన ఆస్తులుగా విప్రవర్గం భావిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఏ సాహిత్య చరిత్రను చూసిన అనేక ఆధారాలు లభిస్తాయి. స్వయంగా సరస్వతీ మాతే అతడి నాలుక మీద బీజాక్షరాలు రాసిందనే ప్రస్తావన ఇందుకు సంబంధించిందే. కానీ, ఉద్ధేశ్యపూర్వక కల్పిత కుట్ర చరిత్ర. నూటికి ఎనభై ఐదుమంది బహుజనుల త్యాగాల మీద ఈ దేశ చరిత్ర నిర్మితమై ఉంది. వారి భాషాసంస్కృతులు విశ్రాంత సమూహాల భాషాసంస్కృతులు ఒక్కటి కావు. నిజానికి ఎవరి భాషా సంస్కృతులు వారికి ఉంటాయి. ఎవరి భాషా సంస్కృతుల్ని వారు గౌరవించుకోవాలి.

కానీ, భారతీయ సమాజంలో పండిత పురోహిత వర్గం అందుకు ఒప్పుకోదు. కులవ్యవస్థ గీచిన గీతల్లోనే జీవించాలని కనిపించని ఫత్వా జారీ చేసింది. ఫలితంగా భాషా సంస్కృతుల్లో కొందరికి మాత్రమే స్థానం లభించింది. మిగిలిన విశాల ప్రజారాశుల భాషా, సంస్కృతి గొరకానివిగా మారాయి. మహాత్మ జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్‌లు చెప్పినట్టు ఈ దేశ చరిత్ర మనువు వారసులకు, మూలవాసులకు మధ్య జరుగుతున్న సంఘర్షణే. ఈ సంఘర్షణలో భాషా సంస్కృతుల అంశం చాలా కీలకమైంది. తమది మాత్రమే గొప్పదనుకునే భావన జాత్యాహంకారం నుండే ఉద్భవిస్తుంది. గోదావరికృష్ణా జీవనదుల మధ్య ఉన్న ప్రాంతం తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే వారి ప్రాంతమని అర్థం.

గోదావరి నదికే తేలివాహ నది అని పేరు. ఆ పేరు మీదుగనే ఈ ప్రాంతానికి తెలంగాణ అని పేరు వచ్చిందని ఒక ఆధారం ఉంది. అలాగే పూర్వ మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలోని తెల్లాపూర్‌లో బయటపడిన శాసనం తెలంగాణ చరిత్రకు మరొక ఆధారం. ఉత్తర భారతదేశం పూర్తయి మధ్య బిందువుగా ఉన్న మధ్యప్రదేశ్ తరువాత దక్షిణ భారత దేశానికి ముఖద్వారం తెలంగాణ నేల. ఇలాంటి నేలకు అధికారికంగా 2500 యేళ్ల చరిత్ర ఉంది. కానీ, మరొక కోణం ప్రపంచంలో ఎక్కడైనా నదుల ఒడ్డున్నే నాగరికతలు వెలుస్తాయి. ఇక్కడ రెండు జీవనదులు ఉన్నప్పుడు ఇక్కడ భాషా సంస్కృతులు లేకుండా ఉండే అవకాశమే లేదు. అలా ఆదిమానవుని అడుగుల జాడ తెలంగాణ నేలలో కూడా ఉంది.

తెలంగాణ భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఈ విషయాన్ని బ్రాహ్మణులు ఒప్పుకోలేరు. దళిత బహుజన కులాల భాషా సంస్కృతులను దెబ్బ తీయడానికే భాషకు సైతం అతీత శక్తులను ఆపాదించారు. కర్మ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి, పండితునిగా పుట్టాలన్నా, పాండిత్యం సంపాదించాలన్నా పెట్టి పుట్టాలనే వాదనను చేశారు. ఇది తెలంగాణ నేలకు సైతం తప్పలేదు. తెలంగాణ సాహిత్యంగా పరిగణింపబడుతున్నదంతా అగ్రవర్ణ ఆధిపత్య భాషదే. ఈ పరిణామానికి క్రీ.శ.12వ శతాబ్దంలో విరామం పలికిన సాంఘిక విప్లవ కవి పాల్కుర్కి సోమనాథుడు. కర్ణాటకలోని బసవేశ్వరుని బోధనల ప్రభావం ఇది. సాంఘిక అంతరాలను తొలగించి, మనుషులందరూ సమానమేనన్న సమాజాన్ని ఆవిష్కరించాలన్నాడు బసవన్న. అట్ల తెలంగాణ తెలుగు సాహిత్యంలో ఉన్న అప్రజాస్వామికత బద్ధలైంది.

లేకుంటే ఇంకా అవే చాంధస మూసధోరణులు కొనసాగి, ఈ సమాజం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేక పోయేది. జాను తెనుగులో సోమనాథుడు చేసిన ప్రయోగం అద్వితీయమైంది. సామన్యున్ని దృష్టిలో పెట్టుకొని రచనలు చేయాలన్న సోయిని అందించింది. తెలంగాణ భాష అంటే ఇక్కడి శ్రామిక కులాల భాష. శ్రమతో ముడిపడిన దళితబహుజన జీవితాల భాష. ఈ భాషను తొక్కిపెట్టింది తెలంగాణ పండిత వర్గం. ఫలితంగానే తెలంగాణ సాహిత్యమంతా అగ్రవర్ణాలతో నిండిపోయింది. రెండున్నర పర్వాలు అనువదించిన నన్నయను ఆంధ్రా కవులు ఆదికవిని చేసినట్టే, తెలంగాణలో కూడా హాలుడు, గుణాఢ్యుని దగ్గరి నుండి ఇదే ధోరణి నిండిపోయింది. మౌఖిక సాహిత్యాన్ని లెక్కలోనికి తీసుకోకుండా, కేవలం లిఖిత సాహిత్యానికే పట్టం కట్టారు. ఈ దుర్మార్గాలను ఖండిస్తూ అక్కడక్కడ కొంత దళిత, బహుజన సృజనకారులు కూడా కనిపిస్తారు. తెలంగాణ తొలి దళిత కవి దున్నా యిద్దాసు ఈ కోవలోకే వస్తాడు.

‘లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు’ అన్నాడు వ్యాకరణకర్త చిన్నయసూరి. దళిత భాష బ్రాహ్మణ వ్యాకరణ సూత్రాల్లో యిమడదు. దళిత భాష సజీవమైంది. నిష్కల్మషంగా, ఉన్నది ఉన్నట్టు, కుండబద్ధలు కొట్టినట్టు, మనసుకు ఏం తోస్తే అదే మాట్లాడే మాట తెలంగాణ దళిత భాష. ఇవాళ దళిత భాషంటే ఆ కట్టవతలి జనాల భాష. ఆ భాషను ఈ అధికార భాషా సంఘాలు, పీఠాలు పట్టించుకోక పోవచ్చు గాని, నిజమైన, అచ్చమైన తెలంగాణ భాషకు ప్రాతినిథ్యం లభించాల్సింది దళిత భాషకే. శ్రమతోటి, ఉత్పత్తి తోటి ముడిపడిన జీవితాలు దళితులవి. మానవ నాగరికతా చరిత్రలో దళితులు ఆదిమ జాతులకు కిందికి వస్తారు. చచ్చిన పశువు చర్మాన్ని ఒలిచి ఒడుపుతో నీటిని నిలువ చేసుకునే తోలు తిత్తిని కనిపెట్టింది దళితుడే. వ్యవసాయానికి తొండం బక్కెన చేసి భూమితల్లి బిడ్డెలకు బువ్వ పెట్టిందీ దళితుడే.

అందుకే దళితులకు ఎంత చరిత్ర ఉందో, దళితుల భాషకు అంతే చరిత్ర ఉంది. దళిత భాష పురా ఆదిమ జాతుల లక్షణంతో జీవత్వంతో తొణికసలాడుతుంది. దళితుల భాష ప్రేమపూర్వక, భావోద్వేగ మాధ్యమం. అగ్రవర్ణాలకు భాష ఆధిపత్య సాధనం. అగ్రవర్ణాల భాష కాలంతో పాటు నిత్య మార్పులకు గురవుతూ యాంత్రిక పడికట్టు పదజాలంగా మారుతుంది. దళితభాష తరం నుండి తరానికి మనిషితనాన్ని, మంచితనాన్ని అందించే పూర్వీకుల ఆస్తిగా మారుతుంది.

అగ్రవర్ణాలు భాషను ఆధారం చేసుకొని ద్వేష, అసూయ భావాలను ప్రచారం చేస్తే, దళితులు భాష ద్వారా మానవతా విలువలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అగ్రవర్ణాలు తమ భాషలో కిందికులాల అస్తిత్వాన్ని, ఉనికిని పూర్తిగా లెక్క చేయకుండా మాట్లాడే స్వభావం ఉంటుంది. వారి మాటల్లో తిట్లకు కింది కులాలను ఛండాలుడా, అప్రాచ్యుడా, పిచ్చకుంట్లోడా వంటి మాటలతో తిట్టే మాటలు ఉంటాయి. అగ్రవర్ణాల వారి తిట్లకు సైతం పురుషాహంకార కులాధిపత్య ధోరణి ఉంటుంది. వారి సామెతలు, పలుకుబడులు నిందలతో దూషణలతో ఉంటాయి. ఉదాహరణకు గొల్లోడికి మల్లెపువ్వునిస్తే గోచిలో పెట్టుకున్నాడని, చాకలి మంగలిపొత్తు ఇంటికి రాదిత్తు అని కిందికులాలను కించపరిచే సామెతలు, దళిత వ్యవహారం జీవన విలువల ప్రతిఫలనం భాషలో కూడా ధ్వనిస్తది. సాధారణంగా ఇతరులకు హాని చేసి జీవించే వారి భాష, సాధుజీవి మాటల వ్యవహారంగా ఉండదు. అందులో ప్రేమాభిమానాలకు తావు లేవు.

అదే ప్రకృతిని పీడించకుండా ప్రకృతితో మమేకమై జీవించే జీవన విధానం దళితులది. రోజువారి జీవితంలో ఇతరులతో మాట్లాడే తీరులోనే దళిత భాషా సౌందర్యం కనిపిస్తుంది. ఎండలో పోయే వాళ్లను నీడకు పిలిచి, కులం అడుగకుండా మంచి నీళ్ళిచ్చే సంస్కృతి దళితులది. దళిత వాడల్లో ఎక్కువగా ఎవ్వరినైనా వరసలు పెట్టి మామ, చిన్నాయిన, అన్న, అక్కా, చెల్లె, వదిన, పెద్దయ్య అంటూ వరసలు పెట్టి పిలచుకునే ఆత్మీయత ఉంటుంది. ‘బాగున్నవా బిడ్డా, బక్కగైనవేంది? తింటలేవా బిడ్డా?’ అనే కుశల క్షేమాలు ఇంటివారికే కాదు బయటివారికి కూడా వాడడం దళిత భాష ఔన్నత్యానికి నిదర్శనం. అవసరాల కోసం ఇంటి పక్క వారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ భాషలోని జీవం తొణికసలాడుతుంది. ‘పాణం బాగున్నదానే పెద్దయ్య?’ అని అడగడంలో ఒక రక్తసంబంధం ధ్వనిస్తది.

కానీ, వారికి ఏ చుట్టరికం ఉండదు. కేవలం తెలిసిన మనిషి అనే కనీస మర్యాద దళిత భాషలో, దళిత సోయిలో ఉంటుంది. ఇక తెలంగాణ గ్రామీణ సామెతల్లో దళితులకే ప్రత్యేకంగా ఉండే సామెతలు కూడా లేకపోలేదు. ఏ విషయాన్నైనా దళిత భాషలో ఒక సొగసుతో వ్యక్తీకరించే పద్ధతి ఉంది. దళితభాషకు అదనపుతనాన్ని అద్దేవి సామెతలే. ‘ఐపోయిన పెండ్లికి డప్పుకొమ్ములెందుకు?’ అనేది దళిత సామెత. డప్పు దళితులది. అందుకే అది సామెతల్లో వచ్చి ప్రయోగంగా మారింది. అలాగే ‘ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు గొరుక్కున్నడట’, ‘గావురం గంజికేడిస్తే, ఈపు దెబ్బలకేడ్సిందట’, ‘నియ్యంతి ఎంతో బర్కతి అంత’. ఇట్లా సామెతల చుట్టూ కూడా దళిత జీవితం అల్లుకొని ఉంది.

ఇక దళిత కులాలకు ప్రత్యేకమైనవి ఆశ్రితకులాల కళారూపాలు. మాల, మాదిగలకు చిందు, బైండ్ల, డక్కలి, పంబాల వంటి ఉపకులాల అనుబంధం ఉంది. ఈ ఉపకులాలు అన్ని ఒక్కో కళారూపాన్ని ప్రదర్శిస్తాయి. చిందువాళ్లు మాదిగల చరిత్రను జాంబవపురాణం వంటి కథల ద్వారా చెబుతారు. ఇట్లా చెప్పేటపుడు వారు పద్యాలు, పాటలు పాడుతూ కథను నడిపిస్తారు. ఇవ్వన్నీ దళిత భాషలో అంతర్భాగమే. అలాగే బైండ్ల వాళ్లు జమిడిక వాయిస్తూ చెప్పే రేణుక ఎల్లమ్మ కథల్లో కూడా అనేక పద్యాలు పాటలు ఉంటాయి. కోడికూతతో నిద్రలేసింది మొదలు, అద్దుమరాత్తిరి వద్ద నిద్ర పోయే వరకు దళితుల వెంట నడిచే నీడ పాటే. ఈ పాటల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి.

చంటిపిల్లలకు పాడే జోలపాటల నుండి మొదలు, వ్యవసాయంలో పొలాల వద్ద నాట్ల పాటలు, కలుపులు తీసే పాటలు, కోతల పాటలు, నూర్పిడి పాటలే కాకుండా ఆయా పండుగలకు పాడే పాటల్లో దళిత భాష కొత్తపుంతలు తొక్కుతుంది. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య మూసను బద్ధలుకొడుతు ముందుకొచ్చింది దళిత సాహిత్యం. దళిత సాహిత్యంలో భాషకు పెద్దపీటను వేశారు రచయితలు. వీరిలో అగ్రగణ్యుడు వేముల ఎల్లయ్య. ఆయన రాసిన కక్క, సిద్ధి నవలలు దళిత భాషకు పట్టం కట్టాయి. అలాగే జాజులగౌరి, జూపాక సుభధ్ర, గోగుశ్యామల, గుండెడప్పు కనకయ్య, కదిరె కృష్ణ, పసునూరి రవీందర్, సిద్ధెంకి యాదగిరి తదితరులు విరివిగా తెలంగాణ దళిత భాషను తమ రచనల్లో ఉపయోగించారు.

ఒక జాతి భాషా సంస్కృతులను సమగ్రంగా విశ్లేషించడం సాహసమే. తెలుగు పండితులు, భాషా శాస్త్రవేత్తలు దృష్టి సారించక విస్మరణకు గురైన దళిత భాషను అర్థం చేసుకున్నప్పుడే తెలంగాణ సామాజిక, సాహిత్య స్వరూపం అవగతమవుతుంది. భాషాధిపత్య గోడలు బద్ధలు అయితే గానీ, మనుషులు, మమతల మధ్య అనుసంధానం మరింత వేగం పుంజుకోదనే చెప్పుకోవాలి. సాహిత్యం, పదాల కూర్పూ ఏ ఒక్కరి సొంతమూ కాదు. అలాగని, వాటిని ప్రయోగించే వారు మేథావులే కానక్కర్లేదు. సామాన్యుల చేతిలో కూడా ఆయుధం అక్షరమే.