Eco-environmentally friendly green energy of sustainable development of solar power plant with Shanghai

ప్రపంచ పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు పెద్దన్నగా నిలుస్తూ వస్తున్న చైనా తన ఊహాతీత పయనంలో చేయరాని తప్పులు చేస్తోంది. తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయనుకునే దేశాలపై ఏకంగా దండయాత్రకు కూడా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ కొన్నిరకాల ‘చీప్‌’ ట్రిక్‌‌లనూ ప్రయోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాపైనే కన్నెర్రజేయాలని చూస్తున్న చైనాను డొనాల్డ్ ట్రంప్ అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేకపోయినా డ్రాగన్ ఎత్తులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశాలైన అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ముదిరాయనే చెప్పాలి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు పెంచడమే ఇందుకు కారణం. మరో 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలను ట్రంప్‌ రెట్టింపు చేశారు. ఓవైపు వాణిజ్య ఉద్రిక్తతలపై ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుండగా ట్రంప్‌ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు, చైనా కూడా ఇందుకు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది.

శుక్రవారం లేదా ఆ తర్వాత నుంచి చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు అమలవుతాయని యూఎస్‌ ఫెడరల్‌ రిజిస్టర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు చైనా నుంచి దిగుమతి చేసుకునే పలు, హ్యాండ్‌బ్యాగులు, దుస్తులు, పాదరక్షలు ఇలా తదితర 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై 10 శాతం సుంకం ఉండేది. తాజాగా దాన్ని 25 శాతానికి పెంచుతూ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, తాజా పరిణామాలపై చైనా అసహనం వ్యక్తం చేసింది. అమెరికాకు బదులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామంటూ ఎదురుదాడికి సిద్ధమైంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా తమతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామంటూ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని బలంగా ఎదుర్కొనేందుకు చైనా మరో అడుగు ముందుకేసింది. తన కరెన్సీ యూనిట్‌ యువాన్‌ విలువను డాలర్‌తో పోలిస్తే 0.6 శాతం తగ్గించింది. ఈ మేరకు చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకొంది. దీంతో డాలర్‌ విలువ 6.8365 యువాన్లకు సమానమైంది. మరోవైపు, చైనా కూడా అమెరికాకు చెందిన 5,410 వస్తువులపై 25, 20, 10 శాతం పన్నులను విధించింది. ఇది జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. వాణిజ్య యుద్ధం మొదలైన దగ్గర నుంచి చైనా కరెన్సీ డీవాల్యేషన్‌ను ఒక ఆయుధంలా వాడుతోంది.

ఈ నిర్ణయంలో కొంత రిస్క్‌ ఉన్నప్పటికీ దీనిపైనే చైనా ఆధారపడి ఉంది. కానీ, చైనా నిర్ణయం మిగిలిన దేశాల వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపనుంది. చైనాలో దిగుమతులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాకపోతే ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకొని చైనా ఈ నిర్ణయం తీసుకొంది. కాకపోతే చైనా విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. కాగా, అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు పడుతుండటంతో వాటి ధరలు సహజంగానే పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్‌ తగ్గుతుంది.

ఇది చైనా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలోపెట్టుకొని చైనా డాలర్‌తో పోలిస్తే యువాన్‌ విలువను తగ్గించింది. ఫలితంగా అంతర్జాతీయంగా తక్కువ డాలర్లతోనే ఎక్కువ చైనా వస్తువులు లభించే పరిస్థితి నెలకొంటుంది. ఇది డిమాండ్‌ను పడిపోనివ్వదు. దీంతోపాటు మిగిలిన మార్కెట్లలో కూడా చైనా వస్తువులు చౌకగా లభిస్తాయి. ఫలితంగా అక్కడ కూడా డిమాండ్‌ పెరుగుతుంది. కాకపోతే ఇక్కడో సమస్య ఉంది. చైనాను చూసి మిగిలిన దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గిస్తే అది ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. అయితే, చైనా యువాన్‌ విలువ తగ్గించడంతో రెండు లాభాలు ఉన్నాయి. ఎగమతులు చౌకగా మారిపోతాయి. అదే సమయంలో దిగుమతులు ఖరీదైపోతాయి.

ఫలితంగా వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు ఈ పరిస్థితి ఉపయోగపడుతుంది. చైనాతో అమెరికాకు వాణిజ్యలోటు డ్రాగన్‌కు అనుకూలంగా ఉంది. ఇదే ఇప్పుడు అమెరికా ఆగ్రహానికి కారణం. తాజాగా చైనా తీసుకున్న నిర్ణయంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యలోటు ప్రతికూలంగా పెరిగిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. కరెన్సీ యూనిట్‌ విలువ తగ్గించడంతో దేశీయంగా సావరీన్‌ బాండ్లపై చెల్లించాల్సిన భారం తగ్గుతుంది. విదేశీ అప్పులు అయితే డాలర్లను కొనుగోలు చేసి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి భారీ మొత్తంలో చేతి చమురు వదులుతుంది.

కానీ, దేశీయ బాండ్లపై ముందే నిర్ణయించిన మొత్తాలు చెల్లింపులు మొత్తం సొంత కరెన్సీలోనే జరుగుతాయి కాబట్టి వీటి భారం చాలా తగ్గుతుంది. అంతిమంగా వాణిజ్య యుద్ధం గెలవడానికి చైనా వేసిన ఈ ప్రయోగం ఎంత మేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.