హైదరాబాద్: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన మీడియా కంటపడలేదు. తాజాగా బయటికి వచ్చిన బాలయ్య కొత్త ఫొటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన కొత్త లుక్‌లో చాలా యంగ్‌గా కనిపించారు. ‘యన్‌.టి.ఆర్’ తర్వాత ఆయన కె.ఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, భూమిక, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. ‘జైసింహా’ తర్వాత బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. కాగా ఈ సినిమాలో బాలయ్య డాన్‌ పాత్రలో కనిపించనున్నారట. అందు కోసం కొత్త లుక్‌లో రెడీ అయ్యారు. ఇటీవల బ్యాంకాక్‌లో సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఓ అభిమాని బాలయ్యతో సెల్ఫీ దిగారు.

బాలయ్య ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపిస్తున్న ఈ ఫొటో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్విటర్‌లో బాలయ్య న్యూలుక్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రకరకాల మీమ్స్‌ను తయారు చేసి షేర్‌ చేస్తున్నారు. చూడటానికి అచ్చం ‘ఐరన్‌మ్యాన్‌’లా ఉన్నారని కామెంట్లు చేశారు.