న్యూఢిల్లీ, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): నీరు లేని మానవ జీవితం ఊహించగలమా? భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నా ఇంకా మనం తాగునీటికి అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటే పరిస్థితులు ఎలా తయారయ్యాయో తలచుకుంటేనే భయమేస్తోంది. ఈ భువిపై ఉన్న ప్రతి ప్రాణి నీరు లేనిదే మనుగడ సాగించలేదు. అలాగే మానవుడు కూడా. మనిషిలో 35 నుండి 40 లీటర్ల నీరు ఉంటుంది.

ఈ నీరు ఏ విధంగానైతే శరీరంపైవున్న మురికిని శుభ్రం చేస్తుందో అలాగే శరీరం లోపలి భాగంలోనున్న మలినాలను కూడా కడిగివేస్తుంది. నీరు అధికంగా తీసుకోవడంవలన ఎలాంటి నష్టం కలగదు. ఎలాగైనా ఆనీరు బయటకు వచ్చేసేదే. దీంతోపాటు మన శరీరానికి అవసరంలేని పదార్థాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఒక యువకుని బరువులో దాదాపు 65 శాతం నీరువుంటుంది. అలాగే యువతి తన శరీరంలోని బరువులో 52 శాతంవరుకు నీరు వుంటుంది. మానవుని శరీరంలోనున్న ఎముకలలో 22 శాతం నీరే ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. దంతాలలో 10 శాతం, చర్మంలో 20 శాతం, మస్తిష్కంలో 74.5 శాతం, రక్తంలో 83 శాతం, కండరాలలో 75.6 శాతం నీరు వుంటుందని వైద్యులు తెలిపారు.

ప్రతి రోజు మానవుని శరీరంలో 2.3 నుండి 2.8 లీటర్ల నీరు విభిన్నమార్గాలగుండా బయటకు వెళ్ళిపోతుంది. మలమార్గం ద్వారా 0.13లీటర్లు, మూత్రం ద్వారా 1.5 లీటర్ల నీరు, చర్మం నుండి చెమట రూపంలో 0.65 లీటర్లు, శ్వాసక్రియ ద్వారా ఊపిరి తిత్తుల నుండి 0.32 లీటర్ల నీరు బయటకు వెళ్ళిపోతుంది. కనుక ప్రాణాధారమైన ఈ నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఈ అంతర్జాతీయ జల దినోత్సవం పిలుపునిస్తోంది. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలు తప్పవని నీటి లభ్యతపై సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్న ఒక పరిశోధకుడు ఆందోళన వెలిబుచ్చాడు.

ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే గుక్కెడు నీళ్లకోసం ప్రజలు కాట్లాడకునే సంఘటనలు ఎంతో దూరంలో ఉండబోవని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశాడు. నిజమే… ఇదివరకు వేసవి కాలంలో నీటి కొరత సమస్య ఎదురయ్యేది. ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా నీటి కొరత సమస్య వెంటాడుతోంది. పట్టణాలు, నగరాలు నీటికోసం విలవిలలాడుతున్నాయి. నీటి కొరతకు అసలు కారణం విచ్చలవిడిగా పెరుగుతున్న జనాభా పెరుగుల. వీటన్నికీ మించి నీరు వృధాకాకుండా చూడాల్సిన ప్రభుత్వాలే ఉదాశీనంగా వ్యవహరిస్తున్న సంఘటనలు కోకొల్లలు.

ఉదాహరణకు దేశరాజధాని ఢిల్లీలో మంచి నీటి పంపులకు ఆయా ప్రదేశాలలో లీకేజీల వల్ల 40% నీరు వృధా పోతోందని ఆ రాష్ట్రంలోని ఒక స్వచ్చంద సంస్థ ఇటీవల తన నివేదికలో తెలిపింది. దేశ రాజధానిలోనే నీటి పొదుపు ఇలా ఉంటే…. ఇక మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి గురించి వేరే విడమరిచి చెప్పనక్కరలేదు. దీనితోపాటు ప్రజలలో నీటిని పొదుపుగా వాడే అలవాటు లేకపోవడం. ప్రభుత్వాలు ఓట్లకు నోట్లు పంచుతుంటాయి తప్ప ప్రాణాధారమైన ఇటువంటి వనరులను ఎలా కాపాడుకోవాలో చెప్పిన పాపాన పోవడం లేదు. ఒకవైపు ప్రజలలో నీటి వినియోగం ఇలా ఉంటే… మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు వర్షపాతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

అసమానతలు చోటుచేసుకు వర్షాకాలం సైతం వేసవిని తలపిస్తోంది. గ్లోబల్ వార్మిగ్ ఫలితమే దీని వెనుక ఉన్న మూల కారణమని శాస్త్రజ్ఞులు చెవినిల్లు కట్టుకుని ఘోషిస్తున్నా పట్టించుకునేవారెవరు. ఇప్పటికే నగర ప్రజలు రోజువారీ 10 లీటర్ల నీటి బాటిళ్లను ఒక్కోటి రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అంటే నీటికోసం నెలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. ఇక మధ్యతరగతి, పేద ప్రజల స్థితి వర్ణనాతీతం. కలుషిత నీళ్లను త్రాగుతూ వ్యాధులబారిన పడుతున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి.

మరోవైపు ప్రజల ఆహారపు అలవాట్లలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం పెరుగుతోంది. ఇది కూడా నీటిని హరించే అంశమే. ఎలాగంటే… మాంసాహారాన్ని తయారు చేసేందుకు అవసరమయ్యే నీరు శాకాహారానికంటే ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువ. ఇలా అన్నీ కలిసి నీటి కొరతలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ముందు తరాలకు నీటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రతి నీటి బొట్టును ప్రాణంతో సమానంగా చూసి ఖర్చు చేసినప్పుడే సాధ్యం. మరి నేటి నుంచే మొదలుపెడదామా… నీటి పొదుపును. ఇక, నీరు పల్లమెరుగు… నిజము దేవుడెరుగు… నీరు ఇగిరిపోతే… మనిషి బతుకు తరుగు… ఇది నిత్యసత్యం.

అనాదిగా జ్ఞానం తెలిసిన మానవుడు తన ఆవాసాలను నదీ పరివాహక ప్రాంతాల పక్కన మలుచుకుని…తన మనుగడ సాగించడం మొదలుపెట్టాడు. కాలక్రమేణా జనాభా విస్తరించడంతో బాటు కాలుష్యం కూడా విజృంభించింది. మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. కనీస అవసరాలలో ఒకటైన నీటి వినియోగం ఎక్కువ కావడంతో తాగే నీటికి కరువొచ్చింది. స్వచ్ఛమైన నీటిని మినరల్‌ వాటర్‌ రూపంలో కొనుక్కోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రపంచ పర్యావరణ సంస్థలన్నీ భూగర్భ జలాలను కాపాడుకోవాలని అప్రమత్తం చేస్తున్నాయి. కనీసం మన తరం అయినా ఈ మహత్కార్యానికి శ్రీకారం చుడితే కనీసం తర్వాత తరం అయినా స్వచ్ఛమైన జలాలను ఆస్వాదిస్తారు.

మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. ఏటా ఉత్సవాన్ని భారీగా జరపడానికి ప్రాధాన్యత ఇచ్చే మన ప్రభుత్వాలు జనం నీటి అవసరాలు తీర్చడంపై మాత్రం ఎందుకో పెద్దగా శ్రద్ధపెట్టరు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనిరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి మహాసభ (యు.ఎన్‌.సి.ఇ.డి.)లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2013 సంవత్సరాన్ని అంతర్జాతీయ నీటి సహకార సంవత్సరంగా ప్రకటించిది. మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే.

అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధౄవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభ వించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, (లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది.

ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కానీ, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా, 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా, అలా జరగడం లేదు.

అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరి శుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి, పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.