అమరావతి, ఆగస్టు 31 (న్యూస్‌టైమ్): ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సహా పార్టీ సీనియర్లు పలువురు ఈ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు, కూలీలతో కలిసి టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు.

గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ వద్ద మూసేసిన అన్నా కాంటీన్ వద్ద ధర్నా నిర్వహించారు. పేదల రాజ్యాన్ని పులివెందుల రాజ్యం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సిమెంట్ కంపెనీలతో బేరం కుదరక, కమిషన్ల కోసమే ఇసుక పందేరానికి తెరతీశారని నిరసనకారులు ఆరోపించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు, కూలీల సమస్యలను నారా లోకేష్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇసుక కొరత వల్ల పనిలేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల ఆవేదన వ్యక్తంచేశారు. అన్నా కాంటీన్ల మూసివేత వల్ల తిండి కూడా దొరకటం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. కార్మికులందరినీ జగన్ చావమంటారా? అంటూ కార్మికులు నిలదీశారు. తుగ్లక్ పరిపాలన గురించి గతంలో విన్నామని, ఇప్పుడు జగన్ రూపంలో ప్రత్యక్షంగా చుస్తున్నామనీ, ఒక్క అవకాశం అడిగారు కదా అని ఇస్తే తుగ్లక్ పాలన వచ్చిందని నారా లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు.

భారతి సిమెంట్ బస్తా 360 రూపాయలు ఉంటే భారతి ఇసుక బస్తా రూ.400 ఉందన్నారు. దేశాన్ని దోచిన అవినీతిపరుడు ఇవాళ ఇసుకనీ వదల్లేదని ఎద్దేవాచేశారు. పనుల్లేక అంతా రోడ్డున పడ్డారని, రాష్ట్రంలో ఇసుకధర ఎలా పెరిగిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నా అరెస్టులని బెదిరిస్తున్నారని, ఎక్కడికక్కడ తెదేపా నాయకుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ తెలిపారు. ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికి రూ.60వేలు ఇచ్చి ఆదుకోవాలని పట్టుబడ్డారు. అలాగే, ఇసుక కొరతపై విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తదితరులు ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఇసుక కొరత వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుక క్వారీల మాటున లక్షలు దోచుకునేందుకే కృత్రిమ ఇసుక కొరతతో సృష్టించారు.

కొత్త పాలసీ పేరుతో క్వారీలను మూసివేయడం అన్యాయం. కొత్త పాలసీ తీసుకువచ్చే వరకు పాత పాలసీని అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఏలూరులో ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపు ఇచ్చింది. అయితే ఆందోళనలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా పోలీసులు ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని గృహ నిర్బంధం చేశారు. ఆందోళనను ఉధృతం చేస్తామని చింతమనేని ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు చింతమనేని గృహనిర్బంధం చేశారు.

దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు. అలాగే, గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్‌లో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాసంవద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపు ఇచ్చినే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిమ్మల నివాసం వద్ద మోహరించారు. అనంతరం ఆయనను నరసాపురం తీసుకువెళుతున్నట్టు చెప్పారు. అయితే చించినాడ మీదుగా తూర్పుగోదావరి తరలించారు. దీంతో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిమ్మల స్వచ్ఛందంగా తాను వస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారని కార్యకర్తలు ఆరోపించారు. అయితే, రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు అందర్నీ హౌస్ అరెస్టుచేసి కేవలం పాలకొల్లు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి బయటకు తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది.

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంటా ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేని దుర్మార్గపు వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో జగన్ పాలన ప్రారంభించారన్నారు. వరద కష్టాల్లో ప్రజలుంటే జగనేమో విదేశీ పర్యటనలు చేశారని విమర్శించారు. ఒక్క అవకాశం ఇద్దామనుకున్న ప్రజల నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీలతో కమిషన్ కుదరకపోవటంతోనే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం కొత్త నాటకం మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు.

ఇసుక టెండర్ల పేరుతో వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా 900 కోట్లు ఆదాయం వచ్చేదన్నారు. అయినా చంద్రబాబు మాత్రం ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రెండు వేలు ఉంటే ఇప్పుడేమో 10 వేలు అయిందన్నారు. మిగతా 8 వేలు ఏ పందికొక్కులు తింటున్నాయని ఫైరయ్యారు. పోలవరంపై కోర్టు మందలించినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందన్నారు. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా చెప్పుకొచ్చారు. రాజధానిలో టీడీపీ నేతలకు భూములున్నాయని ఆరోపించడం కాదన్నారు.

ప్రభుత్వంలో ఉండి గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒకవేళ టీడీపీ నేతలకు భూములుంటే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపు ఇచ్చింది. విజయవాడలో దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కాగా, విత్తనాలు, పంటరుణాలు అందక రైతులు అష్టకష్టాలుపడుతున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్‌, రబీలో విత్తనాల పంపిణీ ప్రణాళిక లేకుండా చేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉరవకొండ మార్కెట్‌ యార్డులో విత్తనాల కోసం జరిగిన తోపులాటలో సిద్దప్ప అనే రైతు మృతి చెందడం పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు.

విత్తనాల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కాకుండానే రాష్ట్రంలో 100కుపైగా అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. 2 నెలల క్రితం విత్తనాల కోసం క్యూలో నిలబడి ఈశ్వరప్ప అనే రైతు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేశారు. సిద్దప్ప, ఈశ్వరప్ప మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఇసుక కొరతను అరికట్టాలని భవన నిర్మాణ కార్మికుల కడుపు నింపాలని, శాంతియుత నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని కోరితే దౌర్జన్యంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీస్‌లు, అక్రమ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్‌లోనే ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల నిరాహార దీక్ష చేపట్టారు.