నల్గొండ: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారు ధరలు మారినట్టుగా నిమ్మధరలు సైతం అమాంతం పెరగడం తిరిగి అదే స్థాయిలో తగ్గిపోవడం జరుగుతోంది. నకిరేకల్‌ నిమ్మ మార్కెట్‌ను శాసిస్తోంది. అక్కడ దిగుబడులు ఎక్కువగా రావడంతోపాటు విపరీతంగా ఎగుమతి చేస్తున్నారు. దాంతో దిగుబడి తగ్గిన ఈ ప్రాంత రైతులు నిత్యం నకిరేకల్‌ నుంచి నిమ్మకాయలను దిగుమతి చేసుకుని ద క్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా దక్షిణ భారత దేశంపై ఆధారపడే నిమ్మమార్కెట్‌ నడుస్తోంది. సాధారణంగా ఢిల్లీ మార్కెట్‌ నిమ్మ ధరలను నిర్ణయిస్తుంది.

అక్కడి డిమాండ్‌ను బట్టి ఈ ప్రాంతం వ్యాపారులు ధరలను నిర్ణయించి ఎగుమతి చేస్తుంటారు. అయితే కొంతకాలంగా ఢిల్లీ మార్కెట్‌లో కాయలకు డిమాండ్‌ తగ్గిపోవడంతో పొదలకూరు నిమ్మ మార్కెట్‌ యార్డు వ్యాపారులు దక్షిణ భారతదేశంలోని చెన్నై, మధురై, కేరళ, బెంగుళూరు తదితర ప్రాంతాలకు కాయలను ఎగుమతి చేస్తున్నారు. దక్షిణభారత దేశ మార్కెట్‌లో సైతం వ్యాపారులు, రైతులు ఆశించిన స్థాయిలో నిమ్మ ధరలు ఇటీవల పెరిగాయి. ఫలితంగా ఇటీవల ఒక్కసారిగా సైజు బాగున్న కాయలు లూజు (బస్తా) ఒక్కటింటికి రూ.4500 వరకు ధర పలికింది. పండుకాయలు సైతం రూ.2500 వరకు ధరలు పలికాయి. అదే సమయంలో ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం లూజు (బస్తా) ఒక్కటింటికి రూ. 1500 నుంచి రూ.2000 వరకు ధర పలుకుతోంది. అది కూడా కాయల సైజు బాగుంటేనే ఆ ధరలు పలుకుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతం నల్గొండ జిల్లా నకిరేకల్‌ నిమ్మ మార్కెట్టేనంటున్నారు. అక్కడి కాయల సైజు బాగుండడంతో పాటు, దిగుబడి పెరగడంతో నకిరేకల్‌ వ్యాపారులు దక్షిణ భారతదేశ నిమ్మమార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదిగినట్టు తెలుస్తోంది.

అంతేకాక పొదలకూరు వ్యాపారులు సైతం తప్పనిసరి పరిస్థితిల్లో ప్రతి నిత్యం నకిరేకల్‌ నుంచి సుమారు రూ.10 లక్షల కాయలను దిగుమతి చేసుకుని ప్యాకింగ్‌ చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కాయల దిగుబడి తగ్గిన ప్రతిసారీ వ్యాపారులు నకిరేకల్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి కాయలు నాణ్యత మెరుగ్గా లేకున్నా సైజు బాగుండడంతో వారి కాయలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటోంది. పొదలకూరు యార్డు వ్యాపారుల్లో కొందరు పూర్తిగా నకిరేకల్‌పై ఆధారపడి కూడా వ్యాపారం చేస్తున్నారు.